గంగా నదిలో మృతదేహాలు... యూపీ,బిహార్ సహా కేంద్రానికి మానవ హక్కుల కమిషన్ నోటీసులు...
ఇటీవల ఉత్తరప్రదేశ్,బిహార్‌లలో గంగా నదిలో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు కొట్టుకొచ్చిన అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై అందిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఉత్తరప్రదేశ్,బిహార్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
పవిత్ర గంగా నదిలో మృతదేహాలను పడేయడం క్లీన్ గంగా ప్రాజెక్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లేనని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ఈ విషయంలో యూపీ,బిహార్ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను వెల్లడించాలని ఆదేశించింది. ప్రజలను చైతన్యపరచడంలో,మృతదేహాలను నదిలో పడేయకుండా చూడటంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరింది.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో దాదాపు 52 మృతదేహాలు గంగా నదిలో కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఉజియార్,కల్హాదియా,బరౌలి ప్రాంతాల్లోని గంగా నది తీరాల్లోకి మృతదేహాలు కొట్టుకొచ్చాయి. అటు బిహార్‌లోని చౌసా పట్టణంలో ఉన్న గంగా నది తీరానికి దాదాపు 71 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ మృతదేహాలన్ని కోవిడ్ పేషెంట్లవే అన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకూ అధికారులు ధ్రువీకరించలేదు. కోవిడ్ పేషెంట్ల అంత్యక్రియలకు భారీ మొత్తంలో ఖర్చు అవుతున్నందునా... అంత స్తోమత లేకనే మృతదేహాలను ఇలా నదిలో పడేస్తున్నారన్న ఆరోపణలను మాత్రం తోసిపుచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి రెండు రోజుల క్రితం కొన్ని షాకింగ్ వీడియోలు కూడా వెలుగుచూశాయి. రాత్రి వేళల్లో అంబులెన్సు డ్రైవర్లు యూపీ-బిహార్ సరిహద్దులోని జైప్రభ సేతు బ్రిడ్జి పైనుంచి మృతదేహాలను నదిలోకి విసిరేస్తున్నట్లు ఆ వీడియోలు వెల్లడించాయి. బీహార్ బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సైతం ఈ ప్రచారాన్ని ధ్రువీకరించారు. అంబులెన్సు డ్రైవర్లు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు గంగా నదిలో మృతదేహాలపై విచారణ జరుపుతున్నాయి.
కాగా,కరోనా సోకిన మృతదేహాలు నదిలో కొట్టుకురావడంతో బిహార్,యూపీ ప్రజలు వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనని ఆందోళన చెందారు. నిజానికి దీనిపై ఇప్పటివరకూ కచ్చితమైన అధ్యయనాలేవీ లేవు. కానీ
నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాత్రం దీనిపై ఆందోళన అక్కర్లేదని చెప్పారు.నీళ్ల ద్వారా కరోనా అంతగా వ్యాప్తి చెందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications