No-Confidence Motion : అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలు-కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ తో ప్రారంభం..
మణిపూర్ లో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ ఘటనలపై ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ ఆమోదించిన నేపథ్యంలో ఇవాళ లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ చర్చను అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ ప్రారంభించారు. ఆయన తర్వాత మిగతా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడతారు. ఇందులో రాహుల్ గాంధీతో పాటు ఇతర సభ్యులు ఉంటారు. అలాగే అధికార బీజేపీ నుంచి 15 మందిని ఎంపిక చేశారు.
ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చను ఇవాళ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. ప్రతిపక్షాల నుంచి ఈ చర్చను ప్రారంభించారు. మణిపూర్ న్యాయం కోరుతోందని, ఇండియా కూటమి మణిపూర్ కోసం ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని గగోయ్ తెలిపారు. మణిపూర్ ఘటనలు కేవలం ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్నవి కావన్నారు. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. మణిపూర్ కాలిపోతుంటే యావత్ భారతదేశం మండుతోందన్నారు.

మణిపూర్ ఘటనలపై అన్ని పార్టీలు స్పందిస్తున్నాయని, ప్రధాని మోడీ కూడా దీనిపై స్పందించాలని కాంగ్రెస్ ఎంపీ గగోయ్ కోరారు. ప్రధాని మాట్లాడితే ఈ సంక్షోభ సమయంలో పార్లమెంటు తమతో ఉందని మణిపూర్‌కు సందేశం వెళ్తుందన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రధానికి మూడు ప్రశ్నలు సంధించారు. ఆయన మణిపూర్ ఎందుకు వెళ్ళలేదని, మణిపూర్ గురించి మాట్లాడటానికి దాదాపు 80 రోజులు ఎందుకు పట్టిందని, ఆయన కేవలం 30 సెకన్లు మాత్రమే దీనిపై మాట్లాడారని, మీరు మణిపూర్ సీఎంను ఎందుకు తప్పించలేదని గగోయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మరోవైపు కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ఎందుకు అవిశ్వాసంపై చర్చను ప్రారంభించలేకపోయారని బీజేపీ ప్రశ్నించింది. ఈ మేరకు రాహుల్ ను, విపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో విపక్ష ఇండియా కూటమి చేతులు కలపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది అసలు అవిశ్వాస తీర్మానమే కాదని విపక్షాల బలం తేల్చే విశ్వాస తీర్మామని మోడీ చెప్పిన విషయాన్ని దూబే గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications