అవిశ్వాసంలో ట్విస్టులు-కేంద్రానికి టీడీపీ, బీజేడీ, బీఎస్పీ హ్యాండ్ ? ఎన్నికల లెక్కలతో.. !
కేంద్ర ప్రభుత్వం మణిపూర్ విషయంలో అనుసరిస్తున్నవైఖరిపై ప్రధాని మౌనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చింది. దీన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఆమోదించారు. త్వరలో అన్ని పార్టీలతో చర్చించి అవిశ్వాస తీర్మానంపై చర్చ, సమయం ఖరారు చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అందరి కంటే ముందు ఎన్డీయే సర్కార్ పై తమకు విశ్వాసం ఉందని, కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే గతంలో ఎన్డీయేకు పలు అంశాల్లో మద్దతుగా నిలిచిన రెండు పార్టీలు మాత్రం ఈసారి అంత సులువుగా మద్దతునిచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం వచ్చే ఏడాది జరిగే ఎన్నికలే. ఈ ఎన్నికల్లో ఒక వేళ బీజేపీ ఓడిపోతే తమ పరిస్ధితి ఏంటనే సందిగ్ధమే. దీంతో టీడీపీ, బీజేడీతో పాటు పలు పార్టీలు గతంలోలా ఎన్డీయేకు మద్దతు ప్రకటించేందుకు ఆలోచిస్తున్నాయి. దీంతో ఎన్డీయే కూటమికీ, ఇండియా కూటమికీ మధ్య ఉంటున్న ఈ పార్టీలు చివరి నిమిషంలో ఏం చేస్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

లోక్ సభలో టీడీపీకి ముగ్గురు ఎంపీలున్నారు. అలాగే ఒడిశాలో అధికార బీజేడీకి 12 మంది ఎంపీలున్నారు. ఈ రెండు పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. ఈ నేపథ్యంలో ఓటింగ్ కు దూరంగా ఉంటే ఎలా ఉంటుందనే దానిపై ఇరు పార్టీలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో 2018లో కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు బీజేడీ ఓటింగ్ కు దూరంగా ఉన్న చరిత్ర ఉంది. అలాగే బీఎస్పీకి లోక్ సభలో 10 మంది ఎంపీలున్నారు. ఈ పార్టీ కూడా ఇప్పటివరకూ అవిశ్వాసానికి మద్దతుగా లేదా వ్యతిరేకంగా తమ ఎంపీలకు ఎలాంటి విప్ జారీ చేయలేదు.
లోక్ సభలో బలాబలాల్ని ఓసారి పరిశీలిస్తే ఎన్డీయేకు 332 మంది ఎంపీల బలం కనిపిస్తోంది అలాగే ఇండియా పేరుతో ఏర్పాటైన విపక్ష కూటమికి 142 మంది ఎంపీల బలం ఉంది. ఈ రెండు కూటములకు దూరంగా ఉంటున్న ఎంపీల సంఖ్య 64. లోక్ సభలో ఉన్న మొత్తం సీట్లలో ఐదు ఖాళీ సీట్లను తీసేస్తే 538 ఎంపీలున్నారు. దీంతో వచ్చే వారం చర్చకు రానున్న అవిశ్వాస తీర్మానం భవిష్యత్తు ఏంటనేది క్లారిటీగానే ఉంది. ఇంత క్లియర్ గా ఉన్న సమీకరణాల్లో తాము ఎవరికి మద్దతిచ్చినా ఫలితంపై పెద్దగా ప్రభావం పడదు. కాబట్టి బీజేడీ, టీడీపీ, బీఎస్సీ వంటి పార్టీలు ఎటు మొగ్గుతాయన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications