దేశంలో మతహింస పెరగలేదు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో మత హింస తీవ్రంగా పెరిగిపోతుందని ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. మత హింస విషయంపై బుధవారం ఆయన రాజ్యసభలో ఓ ప్రకటన విడుదల చేశారు.
అల్పసంఖ్యాక మతాలవారిపై హింసాత్మక ఘటనలు పెరిగాయని ప్రతిపక్షాలు చేస్తున్న వాదన సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2014 లో దేశ వ్యాప్తంగా 644 మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
ఆ ఘర్షణలలో 95 మంది మరణించారని, 1,921 మందికి గాయాలైనాయని వివరించారు. అయితే 2015 అక్టోబర్ వరకు ఇలాంటి సంఘటనలు 650 జరిగాయని గుర్తు చేశారు. అందులో 84 మంది మరణించారని, 1,979 మందికి గాయాలైనాయని కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజిజు వివరించారు.

ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల స్థాయిలో దేశంలో మతహింస జరగలేదని ఖండిస్తూ మంత్రి కిరణ్ రిజిజు ఈ గణాంకాలను రాజ్యసభలో వెల్లడించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ గణాంకాలను అంగీకరించడం లేదు.
గాద్రీ ఘటనపై విపక్షాలు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి వివరణ ఇస్తూ నిషేదిత జంతువును హత్య చేశారనే ఆరోపణలతో ఓ కుటుంబంపై గ్రామస్తులు దాడి చేశారని, అందులో ఒకరు మరణించారని, ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 10 మంది మీద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications