ఆ సీటులో కూర్చుంటే అంతే..! మళ్లీ చట్టసభలో అడుగుపెట్టే సవాలే లేదు!
Recommended Video
ఢిల్లీ : పార్లమెంటు అత్యంత ప్రతిష్టాత్మక హోదాల్లో ఒకటి స్పీకర్ పదవి. సర్వాధికారాలు కలిగిన లోక్‌సభ అధిపతి. పార్లమెంటు బిల్డింగ్‌కు కస్టోడియన్. అయితే శాపమో లేక యాదృచికమో తెలియదు గానీ, గత రెండు దశాబ్దాల్లో స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన వారెవరూ తిరిగి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టకపోవడం ఆసక్తికరం. స్పీకర్ పదవి చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలవడం, పోటీ నుంచి తప్పుకోవడం, పార్టీ టికెట్ నిరాకరించడం లేదా మరణించిన కారణంగా వారు తిరిగి చట్టసభలో అడుగుపెట్టలేకపోయారు.

20 ఏళ్లుగా ఇదే పరిస్థితి
సాధారణంగా లోక్‌సభలో సీనియర్ నాయకులను స్పీకర్‌గా ఎన్నుకుంటారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వారిని గౌరవిస్తారు. ఇప్పటి వరకు 16మంది లోక్‌సభ స్పీకర్లుగా వ్యవహరించగా.. వారిలో నీలం సంజీవరెడ్డి మాత్రమే రెండుసార్లు ఆ పదవి చేపట్టారు. మరో పది మంది మళ్లీ ఎంపీగా ఎన్నికైనా లోక్‌సభ అధిపతి పదవిని చేపట్టలేకపోయారు.

పోటీ నుంచి తప్పుకున్న సుమిత్రా
ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 67ఏళ్ల లోక్‌సభ చరిత్రలో రెండో మహిళా స్పీకర్‌గా 2014 జూన్‌లో ఎన్నికయ్యారు. అయితే బీజేపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఆమె ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఇక 2009లో తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన మీరా కుమార్ 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈసారి కూడా మీరా కుమార్ బీహార్‌లోని ససారాం నియోజకవర్గం నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

రాజకీయాలకు దూరమైన సోమ్‌నాథ్
మీరాకుమార్‌కు ముందు లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి కమ్యూనిస్టు నేత సోమ్‌నాథ్ చటర్జీ. 2004లో స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన విధి నిర్వాహణలో భాగంగా పార్టీ నుంచి బహిష్కరణ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి పరిణామాల నేపథ్యంలో ఛటర్జీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి శుభంకార్డు వేశారు.

శివసేన నుంచి మనోహర్ జోషి
సోమ్‌నాథ్ చటర్జీకి ముందు శివసేన పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మనోహర్ జోషి స్పీకర్ పదవిని అలంకరించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన.. బాలయోగి ఆకస్మిక మరణంతో స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. శివసేన సీనియర్ నేత అయిన మనోహర్ జోషి 2004లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన చట్టసభలో అడుగుపెట్టలేదు.

నియోజకవర్గాలకు దూరం
1952లో లోక్‌సభ తొలి స్పీకర్‌గా నియమితులైన జీఎస్ మావళంకర్ 1956లో చనిపోయారు. ఇక ఎమర్జెన్సీ అనంతరం 1977లో లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన కేఎస్ హెగ్డే సైతం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత నాలుగు దఫాలుగా స్పీకర్‌గా పనిచేసిన నేతలు తిరిగి ఎందుకు చట్టసభలో అడుగుపెట్టలేదనడానికి కచ్చితమైన కారణమంటూ ఏమీ లేదు. నిజానికి స్పీకర్‌గా ఉన్న నాయకులు తమ నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి సారించే అవకాశం తక్కువ. ఈ కారణంగానే వారు ఓటర్ల నమ్మకం కోల్పోయి ఓటమి పాలవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications