అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లిపై మరో సంచలనం
Mukesh Ambani: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం వైభవంగా సాగింది. వారం రోజుల పాటు వేడుకగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది అంబానీ కుటుంబం.
ఈ నెల 12వ తేదీన ముంబై బాంద్రా- కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు వారం రోజుల ముందు నుంచీ సంగీత్ నిర్వహించారు. ఆ తరువాత శుభ్ ఆశీర్వాద్ వేడుకలను చేపట్టారు.

నూతన వధూవరులను ఆశీర్వదించడానికి దేశ, విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు, క్రికెటర్లు దీనికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు.
కొడుకు పెళ్లి కోసం అంబానీ అక్షరాలా 5,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగా పెళ్లి అత్యంత ఆడంబరంగా చేశారు. సుమారు రెండు వారాల పాటు మీడియాలో హెడ్ లైన్ న్యూస్‌గా నిలిచిందా పెళ్లి. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను లండన్‌లోని ప్రఖ్యాత స్టోక్ పార్క్ సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్‌లో రెండు నెలల పాటు నిర్వహించేలా ముఖేష్ అంబానీ ప్లాన్ చేసినట్లు వార్తలొచ్చాయి. దీనికోసం మరో 2,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేయనున్నారంటూ ప్రచారం జరిగింది.
ఈ వార్తలను స్టోక్ పార్క్ హోటల్ యాజమాన్యం తోసిపుచ్చింది. ఆ వార్తలు నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఎలాంటి పెళ్లి వేడుకలను నిర్వహించట్లేదని పేర్కొంది. ఈ వేసవిలో తమ హోటల్‌లో గానీ, ఎస్టేట్‌లో గానీ పెళ్లి వేడుకలను నిర్వహించాలంటూ తమకు ఎవరూ ప్రపోజల్స్ పంపించలేదనీ వివరించింది.
సాధారణంగా ఒకరి ప్రైవేట్ విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని, ఎలాంటి వ్యాఖ్యనాలు చేయమని పేర్కొంది స్టోక్ పార్క్ హోటల్ మేనేజ్‌మెంట్. మీడియా తమ హోటల్‌పై వస్తోన్న ఊహాగానాలను దృష్టిలో పెట్టుకుని స్పందించాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ సమ్మర్‌లో హోటల్ లేదా గోల్ఫ్ ఎస్టేట్‌లో వివాహ వేడుకలు ప్లాన్ చేయలేదని తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications