ప్రధాని మోదీ కలుగులో ఎలుక
జైపూర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే- ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన ప్రధాని మోదీని కలుగులో ఎలుకలా అభివర్ణించారు. మాటలు మాత్రం కోటలు దాటుతుంటాయని, పులిలా కనిపిస్తుంటారని ధ్వజమెత్తారు.

చైనా దురాక్రమణపై..
రాజస్థాన్‌లోని అల్వార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఖర్గె మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం గురించి ప్రస్తావించారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత భూభాగంలోకి తరచూ చొచ్చుకుని వస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని, అయినప్పటికీ- ఈ విషయాన్ని మాట్లాడటానికి బీజేపీ నాయకులెవరకీ ధైర్యం చాలట్లేదని మండిపడ్డారు.

కలుగులో ఎలుక..
చైనాను నియంత్రించే విషయంలో ప్రధాని మోదీ కలుగులో ఎలుకలా వ్యవహరిస్తోన్నారంటూ మల్లికార్జున ఖర్గె ఆరోపించారు. బహిరంగ సభల్లో పులిలా మాటలు మాట్లాడుతున్నారని, చేతలు మాత్రం కలుగులో ఎలుకను తలపిస్తోన్నాయంటూ ఘాటుగా విమర్శించారు. దేశ సరిహద్దులను చైనా సైన్యం ఆక్రమించుకుంటోందంటూ శాటిలైట్ ఫొటోలు సైతం నిర్ధారిస్తోన్నప్పటికీ- కేంద్రం మాత్రం పెదవి విప్పట్లేదని చెప్పుకొచ్చారు మల్లికార్జున ఖర్గె.

ఉభయసభలో చర్చకు..
చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న రాష్ట్రాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని ఖర్గె అన్నారు. ఆయా అంశాలన్నింటి మీద లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించాలని తాము పట్టుబడుతున్నామని గుర్తు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదని చెప్పారు. తాము ఎంత డిమాండ్ చేస్తోన్నప్పటికీ.. సభలను ప్రతిష్ఠంభింపజేస్తోన్నప్పటికీ- చర్చకు అధికార పక్షం ఏ మాత్రం సిద్ధం కావట్లేదని వివరించారు.

బయట పులి..
బయట పులిలా మాట్లాడే బీజేపీ నేతలు గానీ, ప్రధాని మోదీ గానీ చేతల్లోకొచ్చేటప్పటికి ఎలుకల్లా వ్యవహరిస్తోన్నారంటూ ధ్వజమెత్తారాయన. చైనా అంశంపై మాట్లాడటానికి లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు వాయిదా తీర్మానాలు, నోటీసులు ఇచ్చినా గానీ అధికార పార్టీ పెడచెవిన పెడుతోందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది త్యాగధనులను కోల్పోయిందని మల్లికార్జున ఖర్గె అన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే.. దేశద్రోహి ముద్ర..
దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలను అర్పించారని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్రం కోసం బీజేపీ నాయకులు ఏ త్యాగాలు చేశారని మల్లికార్జున ఖర్గె నిలదీశారు. బీజేపీ నేతల ఇళ్లల్లో కనీసం కుక్క కూడా చావలేదని ఆయన ధ్వజమెత్తారు. అలాంటి వారు దేశభక్తులుగా చలామణి అవుతున్నారని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు దేశద్రోహులుగా ముద్ర వేయించుకుంటోన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications