వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ఒడిశాకు చెందిన మహిళ మతిల్దా కుల్లూ చోటు దక్కించుకున్నారు. దేశంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒకరుగా ఆమె ఎంపికయ్యారు.

didi

ఫోర్బ్స్ ప్రచురించిన ఈ జాబితాలో ఎస్‌బీఐ మాజీ జనరల్ మేనేజర్ అరుంధతి భట్టాచార్య, బాలీవుడ్ నటి సన్యా మల్హోత్రా కూడా ఉన్నారు.

అయితే మతిల్దా సెలెబ్రిటీ కాదు, అలాగే కార్పొరేట్ ప్రపంచంతో ఆమెకు ఎలాంటి సంబంధాలు కూడా లేవు. ఆమె ఒడిశాలో ఆశావర్కర్.

తన ప్రాంతంలో మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, కరోనా సమయంలో వైరస్ గురించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టడంతో ఆమెకు ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కింది.

నెల జీతం రూ. 4500

45 ఏళ్ల మతిల్దా గిరిజనులు ఎక్కువగా ఉండే సుందర్‌గఢ్ జిల్లాలోని గర్‌గండ్‌బహల్ గ్రామానికి చెందినవారు. ఆమె అక్కడ 15 ఏళ్లుగా ఆశావర్కర్‌గా పనిచేస్తున్నారు.

ఆమె గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి రోగులకు మందులు ఇవ్వడం, గర్భిణీలకు సహాయపడటం, పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించడం, గ్రామంలో పరిశుభ్రతను ప్రోత్సహించడంతో పాటు అనేక అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో దాదాపు వేయిమందికి పైగా జనాభా ఉండగా, ఆమె ఒక్కరే వారందరి బాగోగులు చూస్తారు. ఆశావర్కర్‌గా ఆమె నెలకు రూ. 4500 జీతం అందుకుంటున్నారు.

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం

ఆమె 15 ఏళ్ల క్రితం ఆశావర్కర్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు, తన గ్రామంలోకి ఎవరూ కూడా ఆసుపత్రి ముఖం చూడలేదు. ఎవరైనా అనారోగ్యం పాలైతే, నయం చేయించడం కోసం చేతబడిని ఆశ్రయించేవారు. దీన్ని ఆపడానికి, గ్రామస్థులకు అవగాహన కల్పించడానికి మతిల్దాకు సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చక్కబడ్డాయి. అనారోగ్యానికి గురైన గ్రామస్థులు ప్రస్తుతం చికిత్స కోసం మతిల్దా వద్దకు వస్తున్నారు.

ఉదయం 5 గంటలకే తన దినచర్య ప్రారంభమవుతుందని మతిల్దా చెప్పారు. ఇంటిపనులు ముగించుకొని సైకిల్‌పై గ్రామంలోని ప్రతీ ఇళ్లు తిరుగుతూ గ్రామస్థులను కలుస్తానని పేర్కొన్నారు.

''నాకు, నా పని అంటే ఇష్టం. కానీ జీతం చాలా తక్కువ. గ్రామస్థుల బాగోగులు చూసుకోవడానికి చాలా శ్రమిస్తాం. కానీ ఇప్పటికీ సమయానికి జీతం పొందడం కష్టమే'' అని ఆమె చెప్పారు.

ఆదివాసీ మహిళ అయినందున అంటరానితనం, చిన్నచూపు వంటి సవాళ్లను మతిల్దా ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలినాళ్ల నుంచి కూడా తన పని అంత సులభంగా లేదని, అయినప్పటికీ తన ప్రయత్నాల్లో ఎలాంటి లోటు రానివ్వలేదని ఆమె చెప్పారు.

కరోనాతో సవాళ్లు

కరోనా మహమ్మారి కారణంగా మతిల్దా పనిభారం విపరీతంగా పెరిగింది.

''కరోనా వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సమయంలో, ప్రజల ఆరోగ్య పరీక్షల కోసం ప్రతీ ఇంటికి వెళ్లాలని మాకు చెప్పారు. కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అప్పుడేమో, కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడానికి ప్రజలు సిగ్గుపడేవారు. వారిని ఒప్పించడం మాకు తలకు మించిన పనైంది'' అని ఆమె చెప్పారు.

కానీ, తాను గ్రామంలోని ప్రజలందరికీ టీకాలు వేశానని ఆమె వెల్లడించారు.

''వ్యక్తిగతంగా కూడా ఇది ఆమెకు చాలా సంతోషకరమైన విషయం. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్‌గా మతిల్దా చాలా కష్టపడ్డారు. ప్రజలను జాగ్రత్తగా చూసుకునే క్రమంలో కరోనా బారినపడ్డారు. ఆమెకు కూడా వైరస్ సోకింది. కానీ కరోనా నుంచి కోలుకోగానే ఆమె మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యారు'' అని సుందర్‌గఢ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సరోజ్ కుమార్ మిశ్రా చెప్పారు.

ఫోర్బ్స్‌లో ఆమెకు చోటు ఎలా దక్కింది?

మతిల్దా చేస్తోన్న కృషి, ఫోర్బ్స్ మ్యాగజైన్ దృష్టిలో ఎలా పడింది. వాస్తవానికి, మతిల్దా చేస్తోన్న పని గురించి ఫోర్బ్స్ ఇండియా జర్నలిస్టులకు జాతీయ ఆశావర్కర్ల సమాఖ్య కార్యదర్శి వి. విజయలక్ష్మి సమాచారమిచ్చారు.

''ఇతర ఆశావర్కర్లకు మతిల్దా ఒక ఉదాహరణ. పేద గిరిజన మహిళ అయినప్పటికీ, తన ప్రాంతంలో ఆమె చాలా గొప్పగా పనిచేశారు. పని పట్ల ఆమెకున్న అంకితభావం నన్ను చాలా ఆకట్టుకుంది'' అని ఆమె చెప్పారు.

ఫోర్బ్స్ జాబితాలో ఆమెకు చోటు దక్కిన నేపథ్యంలో, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెను అభినందించారు. ''అంకితభావంతో పనిచేసిన వేలాది మంది కోవిడ్ వారియర్లకు మతిల్దా ప్రతినిధి. వీరంతా ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటానికి ముందుండి పనిచేశారు'' అని ఆయన ట్వీట్ చేశారు.

''కఠినమైన సమయాల్లో మతిల్దా చేసిన సేవలకు ఒడిశా మొత్తం రుణపడిఉంది. అందరికీ ఆమె స్ఫూర్తిదాయకం'' అని ఒడిశా ఆరోగ్య మంత్రి నవ్‌కిశోర్ దాస్ పేర్కొన్నారు.

2005లో భారత ప్రభుత్వం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించింది. ఆ సమయంలోనే ఆశావర్కర్లను నియమించారు. ఇలాంటి ఆశావర్కర్లు దేశంలో పదిలక్షలకు పైగా ఉన్నారు. కరోనా విజృంభణ సమయంలో వీరంతా వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ వీరంతా నామమాత్రపు వేతనానికే పనిచేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 

English summary
Odisha Asha worker Matilda gets place in forbes magazine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X