Naveen Patnaik : విపక్ష కూటమిపై చర్చించలేదు-మమతతో భేటీకి ముందు ఒడిశా సీఎం నవీన్ కామెంట్స్..
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం దేశంలో రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ముఖ్యంగా అధికార ఎన్డీయేను వరుసగా మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే వీటిలో ఐక్యత కొరవడటంతో ఈ ప్రయత్నాలు ముందుకు సాగడంలేదు. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమి ఏర్పాటు విషయంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు.
కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడతారని పేరున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఈసారి బీజేపీతో ముఖాముఖీ పోరాటం కోరుకుంటున్నారా లేక విపక్షాలను కలుపుకుని వెళతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమి ఏర్పాటుపై ఆయన ఇవాళ స్పందించారు. విపక్షాల కూటమి ఏర్పాటుపై ఇప్పటివరకూ ఎవరితోనూ చర్చించలేదని నవీన్ పట్నాయక్ వెల్లడించారు. రేపు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశానికి సిద్ధమవుతున్న నవీన్.. విపక్షాల కూటమి విషయంలో చర్చలు జరిపేందుకే వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మమతతో జరిగే భేటీలో విపక్షాల కూటమిపై చర్చిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పటివరకూ దీనిపై చర్చించలేదన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలకు సమానదూరం పాటిస్తారని మమత చెప్పిన విషయాన్ని మాత్రం నవీన్ గుర్తుచేశారు. అలాగే కోల్ కతాలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో చర్చలు జరిపిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. తద్వారా తానూ అదే బాటలో వీరితో స్నేహం చేస్తాననే సంకేతాలను ఆయన ఇచ్చినట్లయింది. మరోవైపు ఒడిశాలో మూడు రోజుల పర్యటన కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భువనేశ్వర్ చేరుకున్నారు. జగన్నాథ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అనంతరం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications