అన్ని ప్రభుత్వ బడులకు రంగులు మార్పు- సర్కులర్
Government Schools: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సారథ్యంలో ఒడిశాలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రాథమిక విద్యా మంత్రిత్వ శాఖలో సమూల ప్రక్షాళనకు దిగింది. ఈ దిశగా ఇప్పటికే పలు చర్యలను చేపట్టింది.
సెకండరీ పాఠశాల విద్యార్థుల యూనిఫాంల రంగును మార్చింది ఒడిశా సర్కార్. ఇప్పుడు మరో కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల భవనాలకు కొత్త రంగులను వేయాలని నిర్ణయించింది. గతంలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ ప్రభుత్వం హయాంలో కొనసాగిన బడుల రూపురేఖలను మార్చబోతోంది.

ప్రస్తుతం ఒడిశాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు- ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉంటోన్నాయి. దీన్ని తొలగించి- వాటి స్థానంలో నారింజ రంగు వేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ, సమగ్ర శిక్షా అభియాన్ కింద అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మరమ్మత్తు, పునరుద్ధరణ పనులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆ పనులు పూర్తయిన తరువాత పాఠశాల భవనాలన్నింటికీ కూడా ఆరెంజ్-ట్యాంగ్ కలర్ వేయాలంటూ విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనన్య దాస్ సర్కులర్ ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లు- కమ్ సర్వ శిక్షా అభియాన్ ఛైర్మన్లు దీనిపై నివేదిక ఇవ్వాలని సూచించారు.
కలర్ కోడ్‌ను స్వీకరించడానికి ఫీల్డ్ ఫంక్షనర్లకు తగిన సూచనలు జారీ చేయాలని అన్నారు. ఈ ఆదేశాలు ఆదర్శ పాఠశాలలకు కూడా వర్తింపజేశారు. పాఠశాల భవనాలకు ఆరెంజ్-ట్యాంగ్ రంగు వేస్తారు. ఛాత్ర పరిధాన్ యోజన కింద గత ఏడాది సెకండరీ స్కూల్ విద్యార్థుల యూనిఫాం రంగులను మార్చింది ప్రభుత్వం. తెలుపు ఆకుపచ్చ బదులుగా లేత గోధుమ, మెరూన్ రంగులను చేర్చింది.












Click it and Unblock the Notifications