అడవి పందితో వీరోచితంగా పోరాడిన 14 ఏళ్ల బాలుడు.. చివరికి ఏం జరిగిందంటే..?
ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కటక్(బంకీ) సమీపంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ 14 ఏళ్ల బాలుడు అడవి పందితో సాహసోపేతంగా పోరాటం చేశాడు. తనపై దాడి చేసిన అడవిపందిపై దాదాపు 2 గంటలపాటు వీరోచితంగా పోరాడి ప్రాణాలు కాపాడుకున్నాడు. అడవి పందితో పోరాడుతున్న బాలుడ్ని స్థానికులు గమనించి రక్షించారు. అనంతరం ఆ అడవి పందిని సమీపంలోని అడవుల్లో వదిలేశారు. అడవి జంతువు దాడిలో గాయపడిన బాలుడ్ని అధికారులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక బాలుడి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఒడిషాలోని కటక్ జిల్లా గోపాల్ పూర్ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. సుమన్ అనే 14 ఏళ్ల బాలుడు మంగళవారం ఉదయం నాడికుండ కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో ఓ అడవి పంది బాలుడ్ని వెంబడించింది. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో బాలుడు కాలువలో పడిపోయాడు. అడవి పంది కూడా కాలువలోకి దిగింది. ఈ క్రమంలో సుమన్ ఏమాత్రం భయపడకుండా అడవి పందితో పోరాడాడు. దాదాపు 2 గంటలకు పైగా దానిపై వీరోచితంగా పోరాటం చేశాడు. అడవిపంది తనను గాయపరుస్తున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఆ జంతువును గట్టిగా పట్టుకున్నాడు. అలా రెండు గంటలపాటు దాన్ని నియంత్రించాడు.

ఈ క్రమంలో గ్రామస్థులు సుమన్ ను చూసి అక్కడికి వచ్చారు. అడవి పంది నుంచి బాలుడ్ని కాపాడారు. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది అడవి పందిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసింది. ఇక సుమన్ ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. ఇక సుమన్ అసాధారణమైన సమయస్ఫూర్తి.. ధైర్యానికి ఆ ప్రాంత వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం రెండు గంటలపాటు అడవి పందితో పోరాడిన తీరును అందరూ కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications