బక్రీద్ నాడు మేక బదులు తన గొంతు తానే.కోసుకొని బలిదానం
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) వేడుకల సందర్భంగా భుజలి (పదునైన ఆయుధం)తో మేకను బలి ఇవ్వడం ఆనవాయితీగా పాటిస్తారు. కానీ ఇస్ముహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి అదే భుజలితో తన మెడను కోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
మృతుడి భార్య హజ్రా ఖాటూన్ తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్తకు దయ్యాలు పట్టాయని, తరచుగా అజంగఢ్ దర్గాను సందర్శించేవాడని అంటుంది. మూడు రోజుల క్రితం దర్గా నుంచి తిరిగి వచ్చినట్లు తెలిపింది. బక్రీద్ నాడు కూడా ఇంట్లో ధూపం వెలిగించి తంత్ర మంత్రం చేశాడని.. ఆ తర్వాత అకస్మాత్తుగా రక్తంతో తడిసి పడిపోయాడని పేర్కొంది. అతని దగ్గర్లోనే ఒక భుజలి (పదునైన ఆయుధం) పడి ఉందని చెప్పింది. దాంతో వెంటనే, డయల్ 112 కు సమాచారం అందించినట్టు వెల్లడించింది.

పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన అన్సారీని డియోరియా మెడికల్ కాలేజీకి.. ఆ తర్వాత గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్టు తెలిపారు.
సూసైడ్ నోట్..
ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించగా సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. అందులో.. ఒక మనిషి తన సొంత బిడ్డలా మేకను పెంచి బలిచేస్తాడు. అది కూడా ఒక జీవమే. అలాంటప్పుడు మనల్ని మనం ఎందుకు త్యాగం చేయకూడదు? అల్లాహ్ దూత పేరిట నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. నన్నెవ్వరూ హత్య చేయలేదు అని రాశి ఉన్నట్టు స్పష్టం చేశారు. అంతే కాకుండా తన సమాధిని ఎలా కట్టాలి ? ఏ మట్టిని ఉపయోగించాలి ? ప్రార్థన ఎలా చేయాలి వంటి వివరాలు కూడా ఉన్నట్టు వెల్లడించారు.
అదనపు పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ వర్మ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా గాయపరచుకున్న ఘటనగా ప్రాథమికంగా అనుమానిస్తున్నామన్నారు. అతని సూసైడ్ నోట్ ఆధారంగా మత విశ్వాసాలు, తాంత్రిక చర్యలు వంటి కోణాలనూ పరిశీలిస్తున్నామని చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నామని.. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications