ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం కొలువు దీరిన కొత్త సర్కార్- మంత్రివర్గంలో చేరని కాంగ్రెస్ అప్పుడే డేంజర్ బెల్స్
Omar Abdullah: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గ సహచరులు ప్రమాణం చేశారు. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
శ్రీనగర్‌లోని షేర్-ఐ- కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీ కూటమి ఇక్కడ జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్-6 స్థానాలను గెలుచుకున్నాయి.

భారతీయ జనతా పార్టీ- 29 సీట్లకే పరిమితమైంది. స్వతంత్రులు ఏడుచోట్ల విజయఢంకా మోగించారు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి దక్కినవి మూడు స్థానాలే. సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అభ్యర్థులు ఒక్కో చోట విజయం సాధించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలు లభించడంతో నేషనల్ కాన్ఫరెన్స్ అధికారాన్ని అందుకుంది. దాదాపు 10 సంవత్సరాల తరువాత కొత్త ప్రభుత్వం కొలువుదీరిందిక్కడ. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకోవడం ఇది రెండోసారి. 2009 నుంచి 2015 వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత ఇక్కడ పీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది.
నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంలో చేరలేదు. మంత్రి పదవులను తీసుకోలేదు. బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఇది పక్కలో బల్లెంలా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కాంగ్రెస్ మద్దతు ఉంటేనే మేజిక్ ఫిగర్ అందుకుంటుంది ఎన్సీ.
కాగా- ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే ఎంపీ కణిమోళి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications