మరోసారి తీపికబురు ప్రకటించిన ఆర్బీఐ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నేడు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర (0.50%) తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి దిగొచ్చింది. ఇలా వరుసగా మూడోసారి వడ్డీ రేటును తగ్గించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఎందుకు ఈ నిర్ణయం?
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు కొనసాగుతున్నా, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా ముందుకెళ్తోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు వృద్ధి రేటును ప్రోత్సహించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు.

వృద్ధి అంచనాలు..
2025-26 ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధి రేటు సగటున 6.5% గా ఉండనుందని అంచనా.
ద్రవ్యోల్బణ అంచనాలు..
ఆహార ధరల తగ్గుదలతో ద్రవ్యోల్బణ అంచనాను 4% నుండి 3.7%కి తక్కువ చేశారు.
నగదు నిల్వల నిష్పత్తి..
బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్లు తగ్గించి, రూ. 2.5 లక్షల కోట్లు మదుపులోకి తీసుకురానున్నారు.
మొత్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రూ. 9.5 లక్షల కోట్ల ద్రవ్యాన్ని వ్యవస్థలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
విదేశీ మారక నిల్వలు..
ప్రస్తుతం భారత విదేశీ మారక నిల్వలు $691.5 బిలియన్గా ఉండి, 11 నెలల దిగుమతులకు సరిపడినట్టుగా ఉన్నాయి.
రుణగ్రహీతలకు ప్రయోజనమేంటి..
బ్యాంకులు EBLR (External Benchmark Lending Rate), MCLR (Marginal Cost of Funds Lending Rate) ఆధారంగా రుణాలు ఇస్తుంటాయి. EBLR ఆధారిత రుణాలు రెపో రేటుతో నేరుగా ముడిపడి ఉంటాయి. కాబట్టి రెపో రేటు తగ్గిన వెంటనే వీటి EMI తగ్గుతుంది. అలానే MCLR ఆధారిత రుణాలకు కొంత సమయం పడుతుంది కానీ వాటి వడ్డీ రేట్లు కూడా వెంటనే తగ్గుతాయి. ఈ తగ్గింపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ భారం తగ్గునుందని చెబుతున్నారు. రెపో రేటు తగ్గింపుతో స్టాక్ మార్కెట్ ఊపందుకున్నాయి. ప్రస్తుతం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు $1.7 బిలియన్ స్థాయిలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications