One Nation One election:ఏకకాల ఎన్నికలతో లాభమా నష్టమా..?
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక దేశం ఒక ఎన్నిక అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.ఈ బిల్లు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మరియు ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ప్రభుత్వం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిల్లును ప్రవేశపెట్టే అవకాశంపై ఇప్పటికే అనేక చర్చలు జరిగాయి జరుగుతున్నాయి. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల లాభనష్టాల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.

'ఒక దేశం, ఒకే ఎన్నిక' అనే కాన్సెప్ట్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంపూర్ణ మద్దతు ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అనే అంశం కూడా చేర్చడం జరిగింది. 2016లో నీతి ఆయోగ్ 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' కాన్సెప్ట్ అమలు కోసం వర్క్‌షాప్‌ను నిర్వహించింది. రెండు సంవత్సరాల తర్వాత, 2018లో, లా కమిషన్ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఐదు రాజ్యాంగ సిఫార్సులు అవసరమని పేర్కొంది
ఈ అంశంపై చర్చించేందుకు 2019లో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని కాంగ్రెస్, బహుజన్ సమాజ్‌వావదీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే వంటి ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీఆర్‌ఎస్‌లు పాల్గొన్నాయి. 2022లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు కమిషన్ పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ ఇది అమలు చేసే ముందు రాజ్యాంగంలో కొన్ని సవరణలు అవసరమని చెప్పారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో లా కమిషన్ ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, అధికారులు, విద్యావేత్తలు మరియు ఇతరుల అభిప్రాయాలను కోరింది.
ఏకకాలంలో ఎన్నికలు: ప్రయోజనాలు ఏమిటి : నివేదిక ప్రకారం, 2019 లోక్‌సభ ఎన్నికలకు మొత్తం రూ.60,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ మొత్తంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం ఖర్చులు ఉంటాయి. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ఎన్నికల ఖర్చును తగ్గించుకోవచ్చనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

వివిధ ఎన్నికల కోసం అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని నియమించడం రోజువారీ పరిపాలనా విధులు సాఫీగా సాగడంలో ఆటంకం కలుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో, అధికారులు సంఖ్య పెంచాల్సి ఉంటుంది. అందువలన ఇది సాధారణ పరిపాలనా పనిని ప్రభావితం చేస్తుంది. మరోవైపు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే పాలనాపరమైన పనులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే సంక్షేమ పథకాల అమలు పై ప్రభావం చూపుతుంది. మెరుగ్గా ఈ పథకాలను ప్రజలకు చేరవేయలేమనే అభిప్రాయం ఉంది.భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రక్రియ ఉన్నందున అధికారులు సంక్షేమ పథకాలను చేరవేసే ప్రక్రియపై దృష్టి పెట్టకపోవచ్చనే అభిప్రాయం కొందరి నుంచి వినిపిస్తోంది.మరోవైపు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఇంకొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏకకాల ఎన్నికలు: ప్రతికూలతలు ఏమిటి : ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియతో స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఓటర్లు ఒకే పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో స్థానిక పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీలకు ప్రమాదం పొంచి ఉందనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications