కరుణానిధి శవపేటికపై ఏం రాశారంటే: 33 ఏళ్ల క్రితం స్టాలిన్‌కు అదే మాట చెప్పారు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి భౌతికకాయం ఉంచిన శవపేటికపై ముప్పై మూడేళ్ల క్రితం కొడుకు స్టాలిన్‌కు చెప్పిన మాటలను చెక్కారు. నాడు తండ్రి అతనికి ఓ మాట చెప్పారట. మనం చనిపోయినప్పుడు ప్రజలు మన సమాధిని చూసి విరామం లేకుండా పని చేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకున్నారు అని అనేంతగా పేరు తెచ్చుకోవాలని చెప్పారు. దీనినే ఇప్పుడు శవపేటికపై తమిళంలో రాశారు.
కాగా, కరుణానిధికి మెరీనా బీచ్‌లో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అంతిమయాత్ర కోసం భారీగా పోలీసులను మోహరించారు.

కాగా, కరుణానిధిని కడసారి చూసేందుకు అభిమానులు, డీఎంకే కార్యకర్తలు తరలి వస్తున్నారు. ప్రజల సందర్శనార్ధం కరుణానిధి పార్థివదేహాన్ని రాజాజీ హాల్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి సంయమనంగా ఉన్న అభిమానులు మధ్యాహ్నం కాస్త అదుపు తప్పారు.
కరుణానిధికి నివాళులర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు రావడంతో సామాన్యులకు అవకాశం రాలేదు. దీంతో కరుణానిధిని దగ్గర నుంచి చూడాలని అభిమానులు చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. కొందరు బారీకేడ్లు దాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
'A person who continued to work without rest, now takes rest' written on the coffin of #Karunanidhi pic.twitter.com/diosM06Lbf
— ANI (@ANI) August 8, 2018
ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా 33 మంది వరకు గాయపడ్డారు. రాజాజీ హాల్ సమీపంలో ఉన్న ప్రజలను పోలీసులు చెదరగొట్టారు. హాల్ చుట్టూ భారీగా మోహరించారు. సమీపంలోకి ఎవరూ రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కరుణ పార్థివదేహం ఉన్న ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా తలుపులు వేసేశారు.












Click it and Unblock the Notifications