• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆన్‌లైన్ గేమ్సా... జూద క్రీడలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆన్‌లైన్ గేమింగ్

ఫైసల్ మక్బూల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం మానేశారు. కానీ, అవి ఆయనను ఇంకా ప్రలోభపెడుతూనే ఉన్నాయి.

31 ఏళ్ల మక్బూల్ గత ఏడాది ఆన్‌లైన్‌లో పేకాట ఆడి అయిదు నెలల్లో సుమారు రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఆటను చాలామంది కలిసి ఆడతారు. బోల్డు డబ్బు పందెం కాస్తారు.

"ముందు రూ. 500 లేదా రూ. 1000తో మొదలుపెడతాం. ఏవో కాస్త డబ్బులొస్తాయి. దాంతో, ఆశ పుడుతుంది. మరింత డబ్బు పెడుతూ ఉంటాం. ఒకరోజు ఘోరంగా ఓడిపోయేవరకు డబ్బులు పెడుతూనే ఉంటాం. కానీ, అప్పటికీ ఆడడం ఆపం. పోగొట్టుకున్న డబ్బులు తిరిగి తెచ్చుకోవాలనే పట్టుదల మొదలవుతుంది. కానీ, మీరు ఓడిపోతూనే ఉంటారు. మళ్లీ మళ్లీ డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు" అంటూ మక్బూల్ ఈ ఆట వ్యసనంగా ఎలా మారుతుందో వివరించారు.

మక్బూల్ ఒకప్పుడు తనకొచ్చే జీతంలో 70 శాతాన్ని ఆన్‌లైన్ గేమ్‌లకే వెచ్చించేవాడు. స్నేహితుల వద్ద అప్పు తీసుకుని మరీ ఆడేవారు.

సాంకేతిక పరిభాషలో వీటిని రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ) అంటారు. దేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీలో ఆర్ఎంజీ 80 శాతం ఉందని ఈ-గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈజీఎఫ్) భావిస్తోంది. ఇలాంటి ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో స్వీయ నియంత్రణ ఉండాలని ఈజీఎఫ్ సూచిస్తోంది.

ఆన్‌లైన్ గేమింగ్

'ఇది జూదమే'

మక్బూల్ లాంటి వాళ్లు ఆడే ఆటలు 'బెట్టింగ్' అంటోంది ఈజీఎఫ్ కానీ, విమర్శకులు దీన్ని 'జూదం' అంటున్నారు.

సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ అయ్యర్ ఇలాంటి ఆన్‌లైన్ గేమ్స్ వెబ్‌సైట్‌లపై నిషేధం విధించి, వాటిని బ్లాక్ చేయించేందుకు పోరాడుతున్నారు.

"ఏ ఆన్‌లైన్ గేమ్ అయినా గెలుపోటములు మన చేతుల్లో ఉండవు. పేకాట లాగ అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి. డబ్బులు వస్తే వస్తాయి, పోతే పోతాయి. చాలా అనిశ్చితి ఉంటుంది. స్వభావసిద్ధంగా ఇవి జూదం లాంటివే" అని సిద్ధార్థ్ అంటారు.

భారతదేశంలో జూదం (గ్యాంబ్లింగ్) చట్టవిరుద్ధం అన్నది తెలిసిందే. ఇవి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి అనేక రాష్ట్రాలు ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించాయి.

కానీ, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోర్టులు ఆన్‌లైన్ గేమింగ్‌పై ప్రభుత్వ ఆంక్షలను రద్దు చేశాయి. దీనికి సంబంధించి అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇలాంటి ఆటలను పూర్తిగా నిషేధించాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం, ఆన్‌లైన్ జూదంపై నిషేధం విషయంలో తమ నిబద్ధతను స్పష్టం చేస్తూ వచ్చింది.

ఈ ఏడాది మార్చిలో తమిళనాడు న్యాయ శాఖ మంత్రి ఎస్ రఘుపతి అసెంబ్లీలో మాట్లాడుతూ, ఆన్‌లైన్ జూదంపై "ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థిస్తూ మేం సుప్రీకోర్టుకు వెళ్లాం. కోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం" అన్నారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

'అది జూదం కాదు, ఆడడానికి నైపుణ్యం కావాలి'

ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఆన్‌లైన్ స్కిల్-గేమింగ్‌లో తమది అత్యున్నత స్థానమని పేర్కొంటుంది. జూదానికి, 'ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్'కు తేడా గుర్తించడం అవసరమని ఏఐజీఎఫ్ సూచిస్తోంది.

ఈ గేమ్స్‌లో అదృష్టం కన్నా నైపుణ్యం అవసరమని పేర్కొంది. ఈ సంస్థ సీఈఓ రోలాండ్ లాండర్స్ క్రికెట్‌ను ఉదాహరణగా తీసుకుని ఈ విషయాన్ని వివరించారు.

"క్రికెట్‌లో టాస్ గెలవడం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ, బరిలోకి దిగాక, ఇక అంతా నైపుణ్యమే. అలాగే ఆన్‌లైన్ గేమ్స్ కూడా. ఇది కాకుండా, యాప్‌లలో గేమ్స్ ఆడేవాళ్లకు పందెం కాసే డబ్బుపై పరిమితి చూసుకోమని హెచ్చరికలు చేస్తుంటాం" అని లాండర్స్ చెప్పారు.

ఇది ఎంట్రీ ఫీజు లాంటిదని లాండర్స్ అంటున్నారు.

"వినోదం కోసం కొంత డబ్బు చెల్లించి గేమ్స్ ఆడితే అది జూదం అయిపోదు. ప్రపంచంలో చాలామంది ఆన్‌లైన్ గేమ్స్‌ను అతిపెద్ద వినోద సాధనాలలో ఒకటిగా పరిగణిస్తారు" అని అన్నారు.

అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో వీటి వ్యాపార సామర్థ్యాన్ని విస్మరించడం ఖరీదైన తప్పు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ ప్రతి సంవత్సరం సుమారు 30 శాతం పెరుగుతోంది. మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పార్శ్వం ఇది.

ఈ పరిశ్రమలో సుమారు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ వార్షిక ఆదాయం రూ. 7,500 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని, 2025 నాటికి సుమారు 50,000 కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చని ఏఐజీఎఫ్ అంచనా వేసింది.

ఆన్‌లైన్ గేమింగ్ గురించి పలువురు క్రికెటర్లు ప్రచారం చేయడం వల్ల కూడా పరిశ్రమ లాభపడింది.

"నా అభిమాన క్రికెటర్ ఆన్‌లైన్ గేమ్స్ ప్రొమోట్ చేస్తుంటే, నాకూ అవి ఆడాలనిపిస్తుంది" అని ఫైసల్ మక్బూల్ చెప్పారు.

'ఆన్‌లైన్ గేమ్స్‌పై చట్టబద్ధమైన నియంత్రణ అవసరం'

అయితే, విమర్శకులు ఈ ట్రెండ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"గొప్ప అథ్లెటిక్ సామర్థ్యం లేదా మానసిక దృఢత్వంతో ఆడితే దాన్ని స్కిల్-గేమ్ అంటారు. అది నైపుణ్యం. ఈ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి సంవత్సరాల తరబడి శిక్షణ, అభ్యాసం, పట్టుదల అవసరం" అంటారు సిద్ధార్థ్ అయ్యర్.

వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమలో పెరుగుతున్న కస్టమర్లకు సేవలు అందించేందుకు గేమ్ డెవలపర్‌లు, ఐటీ మద్దతు, పెద్ద కస్టమర్ కేర్ టీమ్‌లు అవసరమని ఏఐజీఎఫ్ అంటోంది.

ఇంతగా వృద్ధి చెందుతున్న పరిశ్రమలో ఆటలపై నిషేధం విధించే బదులు, కొన్ని నిర్దిష్టమైన నియమాలు రూపొందించేందుకు చట్టంతో కలిసి పనిచేస్తే సరిపోతుందని ఈ సంస్థ చెబుతోంది.

ఈ పరిశ్రమ నుండి వచ్చే ఆదాయంపై పన్ను విధించవచ్చని రోలాండ్ లాండర్స్ ప్రతిపాదించారు. కరోనా మహమ్మారి తరువాత ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న ప్రపంచానికి ఈ పన్ను ద్వారా వచ్చే సొమ్ము సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆన్‌లైన్ గేమ్స్ ఆడడానికి ఇప్పటికే సెల్ఫ్-రెగ్యులేటరీ (స్వీయ నియంత్రణ) ఫ్రేంవర్క్ ఉందని లాండర్స్ చెప్పారు. అయితే, అది సరిపోదని న్యాయవాదులు అంటున్నారు.

"అనివార్య దోపిడీపై ఆధారపడే పరిశ్రమలో స్వీయ నియంత్రణ అనేది బూటకం. ఉదాహరణకు మద్యం పరిశ్రమ. మద్యం విక్రయాలు పెంచడానికి మద్యం వియోగదారులపైనే ఆధారపడతారు, తప్పితే వేరే మార్గం లేదు" అని సిద్ధార్థ్ అయ్యర్ అన్నారు.

అయితే, భారతదేశంలో ఇటువంటి చట్టాలు చేయడం అంత సులభం కాదు. ఇంటర్నెట్‌కు సంబంధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు, కానీ జూదం లేదా గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన చట్టాలను రూపొందించే పని రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది.

అంటే, అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా అంగీకరించినప్పుడే ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం లాంటి వాటిపై భారత పార్లమెంటు జాతీయ స్థాయిలో చట్టాన్ని తీసుకురాగలదు.

"ఇంటర్నెట్‌లో జూదానికి సంబంధించిన చట్టాలను అమలు చేయడం పెద్ద సమస్య. దీనిలో ముందడుగు ఎవరువేస్తారు? కేంద్ర ప్రభుత్వమా లేక రాష్ట్ర ప్రభుత్వాలా? వాస్తవానికి, ఎవరూ ఈ సమస్యపై పోరాడడం లేదు" అని సిద్ధార్థ్ అయ్యర్ అన్నారు.

ఆన్‌లైన్ జూదంపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గేమింగ్ ఫెడరేషన్‌ అయినా, న్యాయవాదులైనా, అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో రెగ్యులేషన్ అవసరమని అంగీకరిస్తున్నారు.

వ్యాపార సామర్థ్యాన్ని పెంచడానికే కాకుండా, గేమ్స్ ద్వారా ఆటగాళ్లు సంపాదించిన సొమ్ముకు భద్రత కల్పించడం కోసం కూడా రెగ్యులేషన్ అవసరమని ఇరు వర్గాలూ విశ్వసిస్తున్నాయి.

అయితే, ఆటగాళ్లకు స్వీయ నియంత్రణ ఉండాలని ఏఐజీఎఫ్ లాంటి సంస్థలు భావిస్తున్నాయి.

మరోవైపు, గేమింగ్ కంపెనీలు మరింత జవాబుదారీగా మారాలని ఫైసల్ మక్బూల్ భావిస్తున్నారు. అప్పటివరకు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నవారికి తన అనుభవం ఒక హెచ్చరిక లాంటిదని మక్బూల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Online Games or Gambling, what is happening
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X