చురుగ్గా విపక్షాల ఐక్యతా చర్చలు-ఖర్గే రాహుల్ తో పవార్ భేటీ-ఆప్, లెఫ్ తో నితీశ్ చర్చలు...
దేశంలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో ఉమ్మడి పోరు సాగిస్తున్న వారితో పాటు దూరంగా ఉంటున్న పలు పార్టీల్ని ఒక్క చోటికి చేర్చేందుకు సీనియర్ నేతలు శరద్ పవార్, నితీశ్ కుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఏకకాలంలో వీరిద్దరూ ఇతర విపక్షాల నేతల్ని సంప్రదిస్తున్నారు.
విపక్షాల ఐక్యతా ప్రయత్నాల్లో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు యువనేత రాహుల్ గాంధీని కూడా కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెస్ ను ఆప్, టీఎంసీ, బీఆర్ఎస్ వంటి విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారిని కలుపుకుని వెళ్లేందుకు ఆ పార్టీని ఒప్పించేలా పవార్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పాటు ఇతర అన్ని విపక్ష పార్టీలను కలుపుకుని ఐక్యత సాధిస్తామని ఖర్గే, రాహుల్ తో భేటీ తర్వాత పవార్ తెలిపారు.

ఖర్గే, రాహుల్‌లతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడిన పవార్.. కొన్ని రాజకీయ పార్టీలకు ఒకే విధమైన సిద్ధాంతాలు ఉన్నాయని, వారిని ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ఇదో ప్రారంభం అని, దీని తరువాత, మమతా బెనర్జీ టీఎంసీ, అరవింద్ కేజ్రీవాల్ ఆప్ వంటి ఇతర ప్రతిపక్ష పార్టీలు లేదా ఇప్పటివరకూ చర్చలు జరగని ఇతర పార్టీలు... ఐక్యత కోసం ఈ ప్రక్రియలో వారిని ఒకచోట చేర్చడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉందన్నారు.

మరోవైపు విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న మరో నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా లెఫ్ట్, ఆప్ నేతలతో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ తో భేటీ అయి పలు అంశాలు చర్చించిన నితీశ్.. ఈసారి సీపీఐ, సీపీఎం, ఆప్ జాతీయ నేతల్ని కలిసి చర్చలు జరిపారు. సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత సీతారాం యేచూరితో నితీశ్ చర్చలు జరిపారు. అనంతరం ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తోనూ భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications