ఆత్మహత్య చేసుకోరు: 'టెర్రర్ బోట్'పై తిప్పికొట్టిన పరికర్
న్యూఢిల్లీ: భారత తీరానికి చేరుకోవడానికి ప్రయత్నించిన పడవలో ఉన్నది ఉగ్రవాదులు కారని, స్మగ్లర్లని అంటున్న వాదనను భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరిక్కర్ తిప్పికొట్టారు. స్మగ్లర్లయితే ఆత్మహుతి పాల్పడరని, ఉగ్రవాదాలు కాబట్టే పడవలోని వారు ఆత్మాహుతికి పాల్పడ్డారని ఆయన అన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు అయితే లొంగిపోయి ఉండేవారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
స్మగ్లర్లు పాకిస్తాన్ మారిటైమ్ అధికారులతో ఎందుకు సంబంధాలు కలిగి ఉంటారని ఆయన ప్రశ్నించారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని కూడా ఆయన అడిగారు. నిఘా వర్గాల సమాచారం మేరకు భారత కోస్ట్ గార్డులు తగిన సమయంలో తగిన విధంగా వ్యవహరించారని ఆయన కొనియాడారు. పడవపై 12 గంటల పాటు నిఘా పెట్టారని, ఆ తర్వాతనే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారని ఆయన చెప్పారు.
పడవ ఉన్న ప్రదేశం కూడా సాధారణమైన మార్గం కాదని ఆయన అన్నారు. స్మగ్లర్లు రద్దీగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటున్నారని, తద్వారా తమ పడవ ఇతర పడవలతో కలిసిపోయే విధంగా చూసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పడవలో పేలుడు పదార్థాలు ఉన్నాయని తాను ఊహాగానాలు చేయడం లేదని, అయితే పడవలో ఉన్నవారు స్మగ్లర్లు అనే విషయం నమ్మడానికి మనసొప్పడం లేదని ఆయన అన్నారు.

కోస్ట్ గార్డులు మరో పడవను కూడా చూశారని, అయితే అది అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉందని మంత్రి చెప్పారు. సముద్రంలో కాలిపోయిన పడవ ఉగ్రవాదులదనే ప్రభుత్వ వాదనను కాంగ్రెసు ప్రశ్నించడంతో వివాదం ప్రారంభమైంది. పడవ విషయంలో ప్రభుత్వం నిజాయితీగా ముందుకు రావాలని, ఉగ్రవాదుల పడవ అని చెప్పడానికి ఏ విధమైన ఆధారాలు కూడా లేవని, ఉగ్రవాదులు దాడిని తిప్పికొట్టామి ఎలా చెబుతారని కాంగ్రెసు నేత అజయ్ కుమార్ అన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెసు వాదన రాజకీయాల్లో దిగజారుడు తనానికి అద్దం పడుతోందని బిజెపి విరుచుకుపడింది. జెయుడి చీఫ్ హఫీజ్ సయీద్ పాక్, భారత్ సరిహద్దుల్లో ఉన్నారనే వార్తలపై పరిక్కర్ స్పందించారు. అవాంఛనీయ శక్తులను సరిహద్దులు దాటించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అది తెలియజేస్తోందని ఆయన అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ బలగాలు దాడికి తెగబడడం ఇటీవల పెషావర్ పాఠశాలపై ఇటీల జరిగిన తాలిబన్ దాడుల నుంచి దృష్టి మళ్లించడానికేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications