పాకిస్తాన్.. యథేచ్ఛగా
LoC Kashmir: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి.
ఈ పరిస్థితుల మధ్య ఇరు దేశాల జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ పొడవునా ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు ధృవీకరించారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరగడం వరుసగా ఇది రెండోసారి.

ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా పాకిస్తాన్.. యథేచ్ఛగా కాల్పులకు దిగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. ఎల్ఓసీ పొడవునా ఉండే భారత ఆర్మీ పోస్టులు దానికి టార్గెట్ అయ్యాయి. శుక్రవారం నాడు రాత్రి వేళ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి వివిధ పాకిస్తాన్ ఆర్మీ.. ఎటువంటి కవ్వింపు లేకుండా తేలికపాటి కాల్పులు జరిపాయని ఆర్మీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
సరిహద్దు భద్రత దళాలు తక్షణమే ఎదురుదాడికి దిగాయని, ఈ కాల్పులను తిప్పి కొట్టాయని చెప్పారు. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. ఇదే పరిస్థితి రెండో రోజు కూడా కొనసాగాయి. తుత్మర్ గల్లీ- రామ్‌పూర్ సెక్టార్‌లో శనివారం రాత్రి ఈ ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్తాన్ సరిహద్దు భద్రత సిబ్బంది.. భారత్ ఆర్మీ పోస్టులపై తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. పలు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా భారత జవాన్లు ఎదురు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.
తేలికపాటి కాల్పులే అయినప్పటికీ- పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అసాధారణంగా భావిస్తోన్నారు. ఇది- ఇక్కడితో పరిమితం కాకపోవచ్చు. రెండో రోజు కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తోందని ఆర్మీ తెలిపింది.












Click it and Unblock the Notifications