పనామా పేపర్ల కేసు: మరోసారి అమితాబ్, ఐశ్వర్యరాయ్, అజయ్ దేవ్ గన్ లకు ఈడీ సమస్లు?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు.. నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, నటుడు అజయ్ దేవగన్ లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు.. నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పనామా పేపర్స్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరినీ మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే వీరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ త్వరలోనే విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా వీరికి త్వరలోనే ఈడీ నుంచి సమన్లు జారీ కానున్నట్లు తెలుస్తోంది.
విదేశాల్లో మోస్సాక్ ఫోన్సెకా పేరిట కంపెనీల్లో ఆస్తులు పెట్టుబడిగా పెట్టినట్లు చూపించారని, ఆ కంపెనీల పేరుతో కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించారని పనామా పేపర్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నడుం బిగించింది. 1993-1997 సంవత్సరాల నడుమ నాలుగు ఆఫ్ షోర్ షిప్పింగ్ కంపెనీలకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ డైరెక్టర్ గా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయి.

అయితే తాను నిబంధనలను అతిక్రమించలేదని, పనామా పేపర్లలో ఆరోపిస్తున్న కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఒకసారి ఈడీ నోటీసులు పంపటంతో అమితాబ్ బచ్చన్ ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ లు అందుకు సంబంధించిన పత్రాలను మంగళవారమే ఈడీకి సమర్పించారు. ఈ నేపథ్యంలో వారిని ప్రశ్నించేందుకు ఈడీ మరోసారి సమన్లు పంపనున్నట్లు తెలుస్తోంది.
అజయ్ దేవగన్ కు కూడా...
బాలీవుడ్ మరో నటుడు అజయ్ దేవగన్ కు కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయనకు కూడా ఈడీ నుంచి సమన్లు జారీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అజయ్ దేవగన్ వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications