అమానుషం: రైలులో తల లేని బాలిక శవం
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చౌరీ చౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో తలలేని ఓ బాలిక శవం లభ్యమైంది. రైలును శుభ్రం చేస్తున్న సమయంలో కీనర్లు ఓ నల్ల సంచిలో ఉన్న తల లేని బాలిక శవాన్ని గుర్తించారు. జనరల్ కంపార్టుమెంటులోని అప్పర్ బెర్తులో ఆ సంచి ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
గోరఖ్‌పూర్ స్టేషన్లో రైలు ఆగిన తర్వాత ప్రయాణికులందరూ రైలు నుంచి దిగివెళ్లిపోయారు. ఆ సమయంలోనే కొందరు క్లీనర్లు రైలు లోపల శుభ్రం చేసేందుకు రైలులో ఎక్కారు. అప్పర్ బెర్తులో ఉన్న నల్ల సంచిని వారు గుర్తించారు. ఆ తర్వాత అందులో ఉన్న తల లేని బాలిక శవాన్ని గుర్తించిన సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యంత దారుణంగా బాలిక తలను దుండగులు నరికివేశారని తెలిపారు. ఆమె తల మాత్రం లభ్యం కాలేదని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపిన పోలీసులు, త్వరలోనే బాలిక ఎవరనేది గుర్తిస్తామని చెప్పారు. నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
దొంగనుకొని కొట్టి.. చేతిని కాల్చి
చెన్నై: దొంగ అని అనుమానించి ఓ మానసిక వైకల్యం గల బాలుడిని తీవ్రంగా కొట్టి అతడి చేతికి నిప్పంటించారు. దీంతో ఆ బాలుడి చేయి మణికట్టు వరకు కాలిపోయింది. తమిళనాడులోని ధర్మపురి ప్రాంతంలో పీ రాజా, అతడి స్నేహితుడు గోవిందన్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరిలో రాజా సెల్ ఫోన్ పోవడంతో అక్కడే తిరుగుతున్న ఓ మానసిక వికలాంగుడిని పట్టుకొని, అతడిని దొంగగా అనుమానించి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు.
అనంతరం చేతికి నిప్పంటించారు. ప్రస్తుతం ఆ బాలుడు ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మానసిక వైకల్యం చిన్నారుల హక్కుల ఉద్యమకారుడు ఎస్ నంబురాజన్ సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications