నితీష్ రాకుండా ఏమైనా చేస్తా!: పప్పూ, బిజెపికి షాక్
పాట్నా: రాష్ట్రాన్ని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల నుంచి కాపాడేందుకు అవసరమైతే తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుంటా తప్పుకుంటుందని ఆర్జేడీ బహిష్కృత ఎంపీ, జన్ అధికార పార్టీ నేత పప్పూ యాదవ్ బుధవారం అన్నారు.
మొత్తం 243 సీట్లలో పోటీ చేయాలా లేక 100 సీట్లకు పరిమితం కావాలా లేక అసలు పోటీకే దిగవద్దా అనేది తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకుంటుందన్నారు. లాలూ, నితీష్‌ల పాలనలో బీహార్ అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే తమ లక్ష్యమన్నారు. నితీష్ కుమార్ చెబుతున్న అభివృద్ధి అంతా వట్టిదేనన్నారు. అదంతా అవాస్తవమన్నారు.

బిజెపికి ఎదురు దెబ్బ
బీహార్ ఎన్డీయే కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. కూటమిలో బీజేపీ తరువాత ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఎల్జేపీ పార్లమెంట్ సభ్యుడు పార్టీలోని అన్ని పదవులకు బుధవారం రాజీనామా చేశారు. మరోవైపు టిక్కెట్ లభించని ఇద్దరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం నితీశ్ కుమార్‌ను కలిశారు.
వైశాలి లోకసభ సభ్యుడు రామ కిశోర్ సింగ్ ఎల్జేపీ ప్రధాన కార్యదర్శి పదవికి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ హోదాకు, రాజస్థాన్ పార్టీ ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఎల్జేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు చాలాకాలం అత్యంత సన్నిహితునిగా ఉన్న రామకిశోర్ ఎన్డీయేతో పొత్తు ఖరారయ్యే సమయంలో తనను పక్కన పెట్టారని అలక వహించారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో టిక్కెట్ దొరకని ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అమన్ కుమార్, అజయ్ మండల్‌లు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలిశారు.
వీరు మహాకూటమిలో చేరనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తనకు మొండిచేయి చూపిందని, ముఖ్యమంత్రితో తనకు సత్సంబంధాలున్నాయని అమన్ కుమార్ చెప్పారు.
మరోవైపు బీజేపీ 43 సీట్లలో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం పట్ల ఆర్‌ఎల్‌ఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేసింది. భాగస్వామ్యపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆర్‌ఎల్‌ఎస్పీ ప్రతినిధి ఫజల్ ఇమామ్ మాలిక్ అన్నారు.












Click it and Unblock the Notifications