నితీశ్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ -‘చివరి ఎన్నికలు’ ప్రకటనపై పప్పూ యాదవ్ ఫైర్
బీహార్ ఎన్నికల ముగింపు దశలో నేతల నోటి వెంట సెంటిమెంట్ కామెంట్లు వినిపిస్తుండటం చర్చనీయాంశమైంది. బీహారీగంజ్ స్థానం నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి సుభాషిణి యాదవ్(శరద్ యాదవ్ కూతురు)ను సొంత చెల్లెలిగా పేర్కొంటూ, ఆమెకు ఓటేయాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. జేడీయూ చీఫ్, బీహార్ లో ఎన్డీఏ ముఖచిత్రం, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరో అడుగు ముందేకేసి.. తనకు చివరి ఎన్నికలు ఇవే కాబట్టి కూటమిని గెలిపించాలని ఓటర్లకు విన్నవించుకున్నారు. కాగా..
తనకివే చివరి ఎన్నికలంటూ ప్రచార సభలో సీఎం నితీశ్ ప్రకటించడంపై జన్ అధికార్ పార్టీ నేత పప్పూయాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నితీశ్ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఫైరయ్యారు. ఇంత పిరికి, బలహీనమైన, నిస్సహాయమైన వ్యక్తి మళ్లీ ఎందుకు సీఎం కావాలని ప్రశ్నించారు. బీజేపీ స్క్రిప్టు మేరకే నితీశ్ కుమార్ ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని పప్పూ ఆరోపించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదైన మూడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లా ధమ్‌దాహాలో గురువారం జరిగిన ప్రచారసభలో నితీశ్ మాట్లాడుతూ.. ''ప్రచారంలో ఇదే నా చివరి రోజు.. ఇవే నా చివరి ఎన్నికలు''అని చెప్పారు. పప్పూ యాదవ్ కంటే ముందు ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ సైతం ఈ కామెంట్లపై స్పందిస్తూ.. నితీశ్ చేతులెత్తేశారనడానికి ఇదే నిదర్శనమన్నారు.
బీహార్ ఎన్నికల్లో చివరి దశలో 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సంఘం ఈ మేరకు పూర్తి ఏర్పాట్లు చేసింది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఇప్పటికే మొదటి, రెండో దశల్లో 165 సీట్లకు ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈనెల 10న ఫలితాలు వెలువడతాయి.













Click it and Unblock the Notifications