బదిలీ చిచ్చు: హోమ్ మంత్రిపైనే సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్: ఐపీఎస్ అధికారి సుప్రీంలో పిటీషన్
ముంబై: ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ బదిలీ వ్యవహారం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో చిచ్చురేపింది. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు దారి తీసేలా కనిపిస్తోంది. ఆ ఒక్క బదిలీ అంశం.. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానానికీ చేరింది. మహారాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ పరమ్‌బీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఓ పిటీషన్ దాఖలు చేశారు. ముంబై పోలీస్ కమిషనర్ స్థానం హోమ్ గార్డుల విభాగానికి బదిలీ చేయడం అక్రమమని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
తన బదిలీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. శాఖాపరంగా తనపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ.. రాజకీయ దురుద్దేశంతోనే బదిలీ చేశారని ఆయన అన్నారు. తన బదిలీ వెనుక చోటు చేసుకున్న పరిణామాలను వెలికి తీయడానికి సమగ్ర దర్యాప్తును చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తనపై శాఖాపరంగా గానీ, ఉన్నతస్థాయి అధికారుల తరఫు నుంచి గానీ ఎలాంటి కక్షసాధింపు చర్యలు తీసుకోకుండా ఉండేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

పరమ్‌బీర్ బదిలీ వ్యవహారంలో అనిల్ దేశ్‌ముఖ్ తప్పేమీ లేదంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సమర్థించారు. పరమ్‌బీర్ సింగ్ ఆరోపణలు చేసిన సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఉన్నారని, దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. పరమ్‌బీర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వెంటనే శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతినెలా 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి, తనకు ఇవ్వాలంటూ అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్లు పరమ్ బీర్ రాసిన లేఖ ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications