గ్యాంగ్ రేప్ బాధితురాలికే శిక్ష: కాదన్న తల్లిదండ్రులు
బెంగళూర్: ఎవరో చేసిన నేరానికి ఓ అమ్మాయికి తల్లిదండ్రులు శిక్ష వేశారు. పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై ఇటీవల ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి అండగా ఉండాల్సిన తల్లిదండ్రులు సమాజానికి భయపడి ఆమెను కాదన్నారు. మచ్చ పడుతుందనే భయంతో ఆమెను ఇంట్లోకి రానీయలేదు.
కర్ణాటకలోని గుబ్బి తాలుకాలో గల నిట్టోరుకు సమీపంలో అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆ బాధితురాలు ప్రస్తంత తుమకూరులోని గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోంలో ఉంటోంది. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు చెప్పారు

అమ్మాయిపై అత్యాచారం చేసిన ముగ్గురు యువకులను చేలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకడైన మంజునాథ (25) బాగురు గ్రామానికి చెందినవాడు. ఇతను నిట్టూరులో సెల్‌ఫోన్ రిటైల్ షాపు నడుపుతుంటాడు. మరో నిందితుడు సునీల్ (26) దేవరాయపట్నకు చెందినవాడు. తుమకూరు కారు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు. మరో నిందితుడు 18 ఏళ్ల బాలుడు.
నేరానికి యువకులను సవిత అనే తార్పుడుగత్తె ప్రేరేపించినట్లు తెలుస్తోంది. అమ్మాయికి మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించి నేరానికి పురికొల్పినట్లు చెబుతున్నారు. ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications