దళితుడితో పారిపోయిందని కూతురి హత్య
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమించిన దళిత యువకుడితో పరారైన కూతురికి తల్లిదండ్రులు విషం పెట్టి హత్య చేసిన సంఘటన బెంగళూరు సమీపంలోని రామనగర్ జిల్లా కేజీ హొసహళ్లిలో ఆదివారం జరిగింది.
గ్రామానికి చెందిన గోవిందప్ప, జయలక్ష్మమ్మల కుమార్తె రంజిత (16) బెంగళూరులో తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ చదువుకునేది. ఇదే ప్రాంతంలో పెయింటింగ్ పనిచేసే హుబ్బళ్లికి చెందిన మంజునాథ్ (20)ను ప్రేమించింది. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న పెద్దమ్మ రంజితను సొంతూరుకు పంపించింది. మంజునాథ్ ఈ నెల 6న రంజితను గ్రామం నుంచి హుబ్బళ్లికి తీసుకెళ్లాడు.

రంజిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమికులు హుబ్బళ్లిలో ఉన్నట్లు గుర్తించి రామనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు శనివారం తీసుకువచ్చారు. రంజిత మైనర్ కావడంతో మంజునాథ్‌ను జైలుకు పంపారు. రంజితను తల్లిదండ్రులకు అప్పజెప్పారు.
అయితే, ఆదివారం ఉదయం 10 గంటలకు రంజిత మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు శనివారం రాత్రే విషపూరితమైన ఆహారాన్ని ఇచ్చి రంజిత చావుకు కారకులైనట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications