Parliament: బడ్జెట్ సమావేశాలు ప్రారంభం-కా సేపట్లో ఆర్ధిక సర్వే..!
ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో మోడీ సర్కార్ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్దాయి బడ్జెట్ ఇదే. దీంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఈసారి కేంద్ర బడ్జెట్ ను రేపు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సభలో ఆర్ధిక సర్వేను ఆర్ధిక మంత్రి విడుదల చేస్తారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలనుద్దేశించి ప్రసంగం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరిస్తున్నారు. ఈ ప్రసంగం పూర్తి కాగానే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్ధిక సర్వేను లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ ప్రవేశపెడతారు. ముఖ్య ఆర్ధిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ టీమ్ రూపొందించిన ఈ సర్వేలో ఈ ఏడాది ఆర్ధిక పరిస్ధితిని వివరిస్తారు.
దేశంలో ప్రస్తుతం ఆర్ధిక మందగమన పరిస్ధితులు ఉండటం, అమెరికాలో ట్రంప్ సర్కార్ రాకతో మారిన పరిస్ధితుల ప్రభావం భారతీయులపై ఉండటం వంటి నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ కీలకంగా మారింది. అలాగే ఓవైపు సంస్కరణల్ని కొనసాగిస్తూ మరోవైపు వృద్ధి రేటు కాపాడుకోవడంపై బడ్జెట్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇవాళ పార్లమెంంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టే ఆర్ధిక సర్వేలో ఈ మేరకు ఆర్ధిక మంత్రి బడ్జెట్ నిర్మలా సీతారామన్ సంకేతాలు ఇవ్వబోతున్నారు. అలాగే ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లుతో పాటు 16 బిల్లుల్ని కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోంది. వీటిపై పలు బిల్లులపై విపక్షాలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications