విపక్షాల్ని ఈడీతో టార్గెట్ చేస్తారా ? లోక్ సభ వెల్లోకి దూసుకెళ్లిన సోనియాగాంధీ..
దేశవ్యాప్తంగా విపక్ష నేతలపై పెరుగుతున్న ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ పార్లమెంటునూ ఇదే అంశం కుదిపేసింది. కేంద్రం తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. ఈడీని దుర్వినియోగం చేస్తూ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై లోక్ సభలో జరిగిన నిరసనల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా పాల్గొన్నారు.
ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్నినిరసిస్తూ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ లోక్ సభ వెల్లోకి దూసుకెళ్లారు. కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యులు సభ వెల్ లో నిలబడి, "ఈడీ, మోదీ డౌన్ డౌన్", "నరేంద్ర మోదీ జవాబ్ దో" వంటి నినాదాలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)ఎంపీలు, మరికొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తమ సీట్ల దగ్గర నిలబడి నిరసనల్లో పాల్గొన్నారు.
లోక్‌సభ మొదట ఉదయం 11.10 గంటలకు, తర్వాత మళ్లీ 12.15 గంటలకు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

మధ్యాహ్నం సభ సమావేశం కాగానే కాంగ్రెస్ ఎంపీలు తమ నేత అధిర్ రంజన్ చౌదరి ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి అనుమతించాలని పట్టుబట్టారు. స్పీకర్ స్ధానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ రచ్చ మధ్యే డీఎంకే ఎంపీ దయానిధి మారన్ కాంగ్రెస్ సీనియర్ నేతలు శశి థరూర్, కార్తీ పి చిదంబరం వంటి వారిని సభ వెల్‌కి వచ్చేలా ఒప్పించడం కనిపించింది. దీంతో సోనియా గాంధీ లేచి నిల్చుని వెల్ ఆఫ్ హౌస్‌లో ఆందోళనకారులతో కలిసి చిదంబరాన్ని కూడా ముందు వైపుకు వెళ్లాలని కోరారు. చివరికి తాను కూడా వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. తాజాగా ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీని సుదీర్ఘంగా విచారించింది. దీంతో ఆమె ఇవాళ లోక్ సభలో నిరసన తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications