Parliament RoundUp Today:ఎన్నికల బిల్లుకు రాజ్యసభ మోక్షం, లోక్ సభలో బాల్య వివాహాల బిల్లు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఇవాళ పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రం.. కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టింది. లోక్ సభలో ఆమోదం పొందిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. విపక్షాల నిరసనల మధ్యే దాన్ని ఆమోదించుకుంది. అలాగే లోక్ సభలో బాల్య వివాహాల నిషేధ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉదయం ఉభయసభలు సమావేశమయ్యాయి. అయితే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాల్ని సభాపతులు తిరస్కరించారు. దీంతో విపక్షాలు నిరసనకు దిగాయి. ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు నిరసనగా లోక్ సభలో, ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా రాజ్యసభలో విపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఎన్నికల చట్ట సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. అయితే ఛైర్మన్ దీనికి నిరాకరించారు. దీంతో రాజ్యసభలో నిరసనలు చేసిన విపక్ష ఎంపీలు అనంతరం వాకౌట్ చేశారు. వీరు వాకౌట్ చేయగానే కేంద్రం ఎన్నికల చట్టాల సవరణ బిల్లును ఆమోదించింది. అటు ద్రవ్యవినిమయ బిల్లు 2021 ని కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింంది. అయితే అప్పటికే విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ఎఐఎడిఎంకె ఎంపిలు బిల్లుకు మద్దతు ఇస్తూ "మీ వాగ్దానాలను నెరవేర్చాలని" ప్రభుత్వాన్ని కోరారు.

అటు లోక్ సభలో బాల్య వివాహాల నిషేధ చట్ట సవరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు నిరసనగా కూడా విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెలెక్ట్ కమిటీకు పంపాలని కోరాయి. దీంతో విపక్షాల నిరసనలకు తలొగ్గిన కేంద్రం.. చివరికి దీన్ని స్ధాయీసంఘానికి పంపాలని స్పీకర్ ను కోరింది.
మరోవైపు రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి.. దీనికి మద్దతు ప్రకటించారు. అయితే వచ్చే ఏడాది నాటికి సంక్షేమ పథకాలను పూర్తి చేసేందుకు వీలుగా రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్‌కు) సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తరప్రదేశ్‌గా పరిగణించడం తమకు ఇష్టం లేదని, కానీ కనీసం మమ్మల్ని సమానంగా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరారు. సాగునీటి ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు తగ్గించిందని ఆయన తన ప్రసంగంలో ఆక్షేపిచారు. గత ప్రభుత్వాలు ఎక్కువగా అప్పులు చేయడం వల్ల ఆంధ్రా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో తక్కువ రుణాలు ఉన్నాయని, గత ప్రభుత్వాలు ఎక్కువ రుణాలు తీసుకున్నందుకు మీరు మమ్మల్ని శిక్షిస్తుంటే, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో మీరు తక్కువ రుణాల ప్రయోజనాలను మాకు ఎందుకు ఇవ్వడం లేదని అయోధ్య రామిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు.
నేటి పార్లమెంట్ హైలెట్స్
- పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం
- లోక్ సభలో ఎన్నికల చట్టాలపై, రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ పై నిరసనలు
- రాజ్యసభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లుపై రచ్చ, విపక్షం వాకౌట్ అనంతరం ఆమోదం
- లోక్ సభలో బాల్యవివాహాల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, విపక్షాల వ్యతిరేకత
- రాజ్యసభలో ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, వైసీపీ సహా పలు పార్టీల మద్దతు,












Click it and Unblock the Notifications