Parliament roundup today :రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ప్రతిష్టంభన,చైనా చొరబాట్లపై కేంద్రం క్లారిటీ, trs బాయ్ కాట్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ కూడా విపక్షాల నిరసనల మధ్య కొనసాగాయి. లోక్ సభ కేంద్రం, విపక్షాల కీలక ప్రకటనలు, డిమాండ్లకు వేదిక కాగా.. రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేతపై విపక్షాలు కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. అటు టీఆర్ఎస్ పార్లమెంట్ మిగతా సమావేశాల్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కాగానే లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాల్ని సభాపతులు యథావిధిగా తిరస్కరించారు. అనంతరం లోక్ సభలో తెలంగాణ వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు కొనసాగించారు. అటు రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని కోరుతూ విపక్షాల నిరసనలు కొనసాగాయి. పార్లమెంట్ బయట ధర్నా చేస్తున్న సస్పెండైన రాజ్యసభ ఎంపీలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మద్దతు ప్రకటించారు.

రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని కోరుతూ ఇవాళ కూడా విపక్షాలు కేంద్రం, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యతో చర్చలు జరిపాయి. అయినా ఫలితం తేలలేదు. సస్పైండైన ఎంపీలు క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తేస్తామని కేంద్రం ప్రతిపాదించినా విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఇవాళ కూడా ఈ సస్పెన్షన్ వ్యవహారంపై విపక్ష నేత మల్లిఖార్జున ఖర్జే పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం మాత్రం దక్కలేదు. కేంద్రం,విపక్షాలు ఎవరికి వారు తమ పట్టు కొనసాగిస్తుండటంతో సస్పెన్షన్ వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
అటు లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు వరిధాన్యం కొనుగోలు, వచ్చే సీజన్ లో వరి వేయొద్దన్న కేంద్రం ప్రకటనలపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్రం తీరుకు నిరసనగా ఈ పార్లమెంటు సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించి వెళ్లిపోయారు. అనంతరం స్పందించిన కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్.. తెలంగాణలో వరిధాన్యం వేయొద్దని తాము చెప్పలేదన్నారు. ప్రత్యామ్నాయ పంటల్ని కూడా తాము సూచించలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటికే పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించిన టీఆర్ఎస్ ఇది టీజర్ మాత్రమేనని చెప్పింది.
మరోవైపు వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఆందోళనలు చేపట్టే క్రమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగం, పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అటు సరిహద్దుల్లో చొరబాట్లపై లోక్ జనశక్తి ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిస్తూ చైనా, భూటాన్ నుంచి మాత్రం గత మూడేళ్లలో చొరబాట్లు లేవని తేల్చిచెప్పింది. మరోవైపు పార్లమెంటు సమావేశాలకు బీజేపీ ఎంపీల హాజరు తక్కువగా ఉండటంపై ప్రధాని మోడీ ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో అసంతృప్తి వ్యక్తంచేశారు. మీరు మారతారా, నన్నే మార్చమంటారా అంటూ బీజేపీ ఎంపీల్ని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల జీతభత్యాల సవరణపై బిల్లును కేంద్రం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెడుతోంది.
ఇవాళ పార్లమెంట్ హైలెట్స్
- పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం
- ఇరుసభల్లోనూ విపక్షాల వాయిదా తీర్మానాలు తిరస్కరించిన సభాపతులు
- లోక్ సభలో వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన
- రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని విపక్షాల నిరసనలు
- రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేతకు కేంద్రం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో విపక్షాల చర్చలు
- వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంట్ సమావేశాల్ని బహిష్కరించిన టీఆర్ఎస్
- తెలంగాణలో వరిధాన్యం వేయొద్దని తాము చెప్పలేదని వ్యవసాయమంత్రి తోమర్ క్లారిటీ
- గత మూడేళ్లలో చైనా, భూటాన్ సరిహద్దుల నుంచి చొరబాట్లు లేవన్న కేంద్రం
- నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు, పరిహారం కోరిన రాహుల్ గాంధీ












Click it and Unblock the Notifications