పార్లమెంట్ లో తీవ్ర కలకలం- గ్యాలరీ నుంచి సభలోకి దూకిన దుండగులు- గ్యాస్ లీక్ చేసి..
పార్లమెంట్ పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తవుతున్న వేళ మరోసారి అలాంటి దాడులు చేస్తామని ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాదులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
లోక్ సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలు చూస్తుండగానే ఓ ఇద్దరు అగంతకులు స్పీకర్ వెల్ లోకి దూకారు. ఈ పరిణామంతో లోక్ సభలో ఎంపీలు అవాక్కయ్యారు. భద్రత కోసం పరుగులు తీశారు. వెంటనే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. కాసేపు కొనసాగిన తర్వాత 12 గంటల తర్వాత లోక్ సభలో అకస్మాత్తుగా కలకలం రేగింది. సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు స్పీకర్ వెల్ లోకి దూకారు. ఇందులో ఒకరు అక్కడే ఉన్న గ్యాస్ సిలెండర్లను ఓపెన్ చేశారు. అనంతరం సభ్యులు కూర్చునే బెంచీలపైకి దూకారు. ఈ పరిణామాలతో ఎంపీలు ఒక్కసారిగా భయాందోళనలకు గు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది భారీ ఎత్తున మోహరించారు.
కొత్త పార్లమెంట్ లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడంతో భద్రతా ఉల్లంఘనపై కేంద్రం సీరియస్ అవుతోంది. కొత్త పార్లమెంట్ లో భద్రతా పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, అధునాతత పరిజ్ఞానంతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పుకుంటున్న తరుణంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. సందర్శకుల గ్యాలరీలోకి అనుమతించే వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్న చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఇవాళ పార్లమెంట్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తనను చంపడానికి అమెరికాలో జరిగిన కుట్ర విఫలం అయిన నేపథ్యంలో దానికి కౌంటర్ గా .. డిసెంబర్ 13న కొత్త పార్లమెంట్ భవనంపై దాడి చేస్తామని బెదిరిస్తూ కొత్త వీడియోను విడుదల చేశారు. దీంతో ఇవాళ జరిగిన దాడితో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఏదైనా సంబంధం ఉందేమో అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications