Parliament: బీజేపీ ఎంపీ పాస్ తో గ్యాలరీలోకి-స్మోక్ గ్యాస్ తో భయపెట్టే యత్నం- నలుగురు అరెస్ట్..
ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో భద్రతా ఉల్లంఘన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఉదయం లోక్ సభ సమావేశం అయిన కాసేపటికే సందర్శకుల గ్యాలరీలో ఉన్న దాదాపు 20 ఏళ్ల వయసున్న ఇద్దరు నిందితులు ఒక్కసారిగా సభలోకి దూకి కలకలం రేపారు. ముందు స్పీకర్ వెల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారు.. భద్రతా సిబ్బందిని చూసి ఎంపీల బెంచ్ లపైకి ఎక్కి హల్ చల్ చేశారు. ఇందులో ఒకరు పురుషుడు కాగా, మరొకరు మహిళ.
వీరిద్దరినీ అమోల్ షిండే, నీలం కౌర్ గా పోలీసులు గుర్తించారు. సభలోనే వీరిద్దరిని అదుపులోకి తీసుకుని బయటికి తరలించారు. వీరితో సంబంధం ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అలాగే ఇద్దరు నిందితులు లోక్ సభలోకి మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా పేరుతో ఇచ్చిన పాస్ తో సందర్శకుల గ్యాలరీలోకి ఎంటరైనట్లు తెలుస్తోంది. అనంతరం వారు గ్యాలరీ నుంచి లోక్ సభ లోకి దూకి కలకలం సృష్టించారు.

లోక్ సభలో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం బయటికి తరలిస్తుండగా.. కేంద్రానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. తానాషాహీ బంద్ కరో (నియంతృత్వం నశించాలి) అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు బయటికి వచ్చాయి. మరోవైపు ఇవాళ లోక్ సభలో చోటు చేసుకున్న ఘటనపై దర్యాప్తు జరుగుతోందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభలో వదిలిన పొగ ప్రమాదకరమైనది కాదని ఘటన అనంతరం ఆయన తెలిపారు. సభలోకి వచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించామన్నారు.












Click it and Unblock the Notifications