మోడీజీ.. మీ రాజకీయాలు మార్చుకోండి-పార్లమెంట్ ప్రత్యేక భేటీలో కాంగ్రెస్ అటాక్..
భారతావని స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం నిర్వహిస్తున్న అమృతకాల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో విపక్ష కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఎన్డీయే సర్కార్ పై దాడికి దిగింది. ముఖ్యంగా ప్రధాని మోడీ చేస్తున్న రాజకీయాలను రాజ్యసభ, లోక్ సభల్లో విపక్ష నేతలు మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకూ కాంగ్రెస్ ప్రధానులు విపక్షాలతో ఎలా వ్యవహరించాయన్నది గుర్తుచేశారు.
రాజ్యసభలో ప్రసంగించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. మీ రాజకీయాల తీరు మార్చుకోవాలని బీజేపీకి సలహా ఇచ్చారు. మీ రాజకీయాల తీరు మార్చుకోండి, కొత్త పార్లమెంట్‌కి మారితే కొత్తేమీ జరగదన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 21 సార్లు ప్రసంగాలు ఇచ్చారని, మన్మోహన్ సింగ్ తమ హయాంలో 30 సార్లు ప్రసంగాలు చేశారని ఖర్గే గుర్తుచేశారు. దీనికి విరుద్ధంగా ప్రధాని మోదీ కేవలం రెండు సార్లు మాత్రమే ప్రసంగాలు చేశారన్నారు.

బ్రిటిష్ వారు భారతదేశాన్ని తక్కువ అంచనా వేసారని, అయితే అది ప్రజాస్వామ్య దేశంగా విజయం సాధించిందని ఖర్గే తెలిపారు. 1950లో మనం ప్రజాస్వామ్యాన్ని స్వీకరించినప్పుడు, ఇక్కడ లక్షలాది మంది నిరక్షరాస్యులు ఉన్నందున ప్రజాస్వామ్యం విఫలమవుతుందని చాలా మంది విదేశీ పండితులు భావించారని, అప్పుడు బ్రిటిష్ ప్రధాని చర్చిల్ కూడా బ్రిటిష్ వారు వెళ్లిపోతే, న్యాయవ్యవస్థ, ఆరోగ్య సేవలు, రైల్వేలు, ప్రజా పనులు ఆగిపోతాయని భావించారన్నారు. కానీ తాము ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం ద్వారా వాటిని తప్పుగా నిరూపించామన్నారు. అలాగే దాన్ని బలోపేతం చేశామన్నారు.

అటు లోక్ సభలోనూ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి..సభలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో నెహ్రూ చేసిన కృషిని కొనియాడారు. నెహ్రూ తన ప్రసంగం సమయంలో తన సమయ పరిమితిని మించిపోయినప్పుడల్లా స్పీకర్ బెల్ మోగించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశం-పాకిస్తాన్ విభజన యొక్క పరిణామాలను దేశం ఎదుర్కొంటున్నప్పుడు నెహ్రూ భారతదేశానికి చేసిన సహకారాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్ధితి లేదన్నారు.












Click it and Unblock the Notifications