యూపీ అసెంబ్లీ ఎన్నికలు: యాదవులపై అఖిలేశ్ పట్టు సాధిస్తారా?
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మూడోదశకు చేరుకుంటున్నాయి. సెంట్రల్ యూపీలోని అవధ్ రీజియన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నుంచి అసలుసిసలు అగ్ని పరీక్ష ఎదురు కానున్నది. బీసీ రాజకీయాలకు కేంద్రమైన అవధ్ రీజియన్ సమాజ్ వాదీ పార్టీ నాయకత్వ భవిష్యత్ ను కూడా నిర్దేశిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి 'యాదవ్ లాండ్' అని పేరు కూడా ఉంది.
అధికార సమాజ్ వాదీ పార్టీపై నియంత్రణ సాధించిన సీఎం అఖిలేశ్ యాదవ్.. యాదవ్ రాజకీయాల్లోనూ పట్టు సాధించగలరా? అన్నది ఈ ఎన్నికలు నిర్దేశిస్తాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో 2012లో మాదిరిగా తనకున్న చరిష్మాతో అవధ్ రీజియన్ గల 69 స్థానాలను 55 స్థానాలను ఎస్పీ ఖాతాలో జమ చేసుకోగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదివారం మూడోదశ పోలింగ్ ఈ ప్రాంతంలోనే జరుగనున్నది. తొలి రెండు దశల పోలింగ్ జరిగిన ప్రాంతాలకు, మూడోదశ పోలింగ్ జరిగే ప్రాంతాలకు చాలా తేడాలు ఉన్నాయి. ముస్లింలు, జాట్లు, దళిత సామాజిక వర్గాల పొందికతో భిన్నమైన వాతావరణం అవధ్ రీజియన్‌లో కనిపిస్తుంటుంది. అంతే కాదు. రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు అవధ్ రీజియన్ లోని ఆరు జిల్లాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అవధ్ రీజియన్‌లోని లక్నో, సీతాపూర్, ఉన్నావో, హర్దోయి, రాయబరేలీ, బారాబంకీ జిల్లాలు ఉన్నాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరు జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ మాత్రమే ఉత్తర ప్రదేశ్‌లో అధికారం చేపట్టింది. ఆ పార్టీ నేతే సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధ్య భాగంలోని ఈ జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకున్న వారిదే విజయం.

ఆరు జిల్లాల్లో బీసీలే ప్రధానం
ఈ జిల్లాల పరిధిలో పూర్తిగా బీసీల ఓట్లదే ఆదిపత్యం. ఈ జిల్లాల పరిధిలో దళితుల ఓట్లు కూడా గణనీయ స్థితిలోనే ఉన్నా, అదే స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో అగ్రకులాల ఓట్లు ఉన్నాయి. అయినప్పటికీ బీసీలు, ప్రత్యేకించిన యాదవ్‌లు ఆధిపత్య స్థాయిలో ఉంటే తర్వాతీ స్థానంలో లోధీలు, శాక్యాలు వస్తారు. 1970వ దశకం చివరిలో జనతా పార్టీ ఆవిర్భావం నాటి రోజుల నుంచి.. మరీ ప్రత్యేకించి ‘మండల్ కమిషన్' నివేదిక బహిర్గతమైనప్పటి నుంచి సెంట్రల్ ఉత్తరప్రదేశ్ రీజియన్‌లో బీసీ కుల రాజకీయాలు ఆధిపత్యం వహిస్తూ వచ్చాయి. సెంట్రల్ యూపీ యావత్తు ములాయం సింగ్ యాదవ్ సారథ్యంలో సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటగా మారింది. కొన్నేళ్ల తర్వాత ఆయన సోదరుడు శివ్ పాల్ యాదవ్ క్రమంగా పుంజుకుని అన్న బాటలో సెంట్రల్ యూపీ రీజియన్ లో పట్టు సాధించారు. తద్వారా సమాజ్ వాదీ పార్టీకి యాదవ్‌లు కోర్ గ్రూప్‌గా మారిపోయారు. మిగతా బీసీల్లో రాజకీయ, ఎన్నికల సమీకరణాలను బట్టి ఎస్పీ, బీజేపీ పక్షాన నిలుస్తూ వచ్చారు. దళితులు తక్కువగా ఉన్నా బీఎస్పీకి బాసటగా నిలిచే వారు. ఇక అగ్ర కులాల వారు సహజంగానే మూడు పార్టీల మధ్య చీలిపోతూ వస్తున్నారు.

యాదవేతర బీసీలపై బీజేపీ కన్ను
కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో సెంట్రల్ యూపీలో ఎస్పీ అంచనాలను బీజేపీ దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకించి యాదవేతర బీసీలను తమ వైపుకు ఆకర్షించేందుకు కమలనాథులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి తోడు అధికార సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన సమస్యగా పరిణమించనున్నది. అధికార పార్టీలో గొడవలు క్షేత్రస్థాయిలో ప్రభావితం చేయనున్నాయన్న విమర్శ వినిపిస్తున్నది. అంతర్గత విభేదాలను ఆ పార్టీ వైరి పక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు అమలుచేసేస్తున్నాయి.

మాయావతి ఇలా..
తొలి నుంచి ప్రయత్నాలు సాగిస్తున్న బీఎస్పీ అధినేత మాయావతి.. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు కోసం సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌ను అవమాన పరిచాడని ఆరోపిస్తోంది. శివ్ పాల్ యాదవ్‌కు కీలక సన్నిహితులుగా ఉన్న అంబికా చౌదరి, నారాద్ రాయ్ వంటి ఎస్పీ సీనియర్లను తన పార్టీలో చేర్చుకున్నది. అలాగే బీజేపీ కూడా ఎస్పీలో విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తప్పనిసరిగా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.

ఇలా ములాయం ..
ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ ఈ రీజియన్‌లో శివ్ పాల్ యాదవ్ పోటీచేస్తున్న జస్వంత్ నగర్, చిన్న కోడలు అపర్ణా యాదవ్ పోటీచేసిన లక్నో కంటోన్మెంట్ స్థానంలో ప్రచారానికి పరిమితమయ్యారు. జస్వంత్ నగర్ స్థానాన్ని తన బాబాయి శివ్‌పాల్ యాదవ్‌కు కేటాయించడం ద్వారా మిగతా నియోజకవర్గాలపై ఆయన ద్రుష్టి సారించకుండా అఖిలేశ్ కట్టడి చేశాడన్న సంగతి కిందిస్థాయిలో పార్టీ శ్రేణులందరిలోకి వెళ్లిపోయింది. జస్వంత్ నగర్ నుంచి నామినేషన్ దాఖలుచేసిన తర్వాత మార్చి 11 తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు శివ్ పాల్ వ్యూహాత్మక ప్రకటన చేశారు. దీని ద్వారా యాదవ్ కుటుంబ ఆధిపత్యానికి గండి పడేందుకు రంగం సిద్దమవుతున్నది.

మారిన అఖిలేశ్ వైఖరి
‘పార్టీలో అంతర్గత సమస్యల పట్ల తాము అప్రమత్తంగా ఉన్నాం. ఎటావాలోని కొన్ని సీట్లపై కొంత ప్రభావం ఉంటుంది. యాదవ్ సామాజిక వర్గం అఖిలేశ్ పై పూర్తి విశ్వాసం ఉంది' ఆయన సన్నిహితులు అంటున్నారు. కానీ స్వతంత్ర పరిశీలకులు మాత్రం పార్టీలో అంతర్గత కుమ్ములాటల వ్యవహారం తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ అవమానానికి గురయ్యారన్న అభిప్రాయం యాదవుల్లో ఉంది. ములాయం రెండో భార్య సాధనాగుప్తా మరిది ప్రమోద్ గుప్తా, రఘురాజ్ శాక్య వంటి వారు ప్రతిపాదించిన వారికి టిక్కెట్లు కేటాయించడానికి అఖిలేశ్ యాదవ్ నిరాకరించడం కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అఖిలేశ్‌కు విషమ పరీక్ష
2012 అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్ పురిలోని నాలుగు సీట్లు, ఎటావా, అరౌరియా, కన్నౌజ్ జిల్లాల పరిధిలో మూడేసి సీట్ల చొప్పున ఎస్పీ గెలుచుకున్నది. ఇక బారాబంకీ జిల్లాలో ఆరు స్థానాలను కైవసం చేసుకున్నది. ప్రస్తుతం అధికార సమాజ్ వాదీ పార్టీ లక్నోలో ఒకటి, కాన్పూర్ లో ఒక స్థానం గెలుచుకున్నది. బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాదిస్తే, బీఎస్పీ ఐదు చోట్ల గెలుపొందింది. కాన్పూర్ సిటీ, లక్నో జిల్లాల్లో సమాజ్ వాదీ పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందనడంలో సందేహం లేదు. ఇది అఖిలేశ్ యాదవ్ కు విషమపరీక్షే కానున్నది. అందరి కళ్లూ అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న ప్రజావ్యతిరేకతను అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

1996లో బీఎస్పీ ఇలా
1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ 33, బీఎస్పీ 67 స్థానాలను గెలుచుకున్నాయి. త్రిశంకు సభ ఏర్పడింది. అవధ్ రీజియన్ లో 38 స్థానాలకు గాను కాంగ్రెస్ - బీఎస్పీ కూటమి కేవలం 12 సీట్లు మాత్రమే గెలుచుకున్నది. కానీ కొన్ని నెలల తర్వాత బీజేపీతో కలిసి బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆరు జిల్లాల పరిధిలోని 38 స్థానాల్లో బీజేపీ, బీఎస్పీ 18 స్థానాల్లో విజయం సాధించాయి.

2002లో బీఎస్పీ - బీజేపీ సంకీర్ణం
2002 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిశంకు సభ ఏర్పడింది. సమాజ్ వాదీ పార్టీ 143 స్థానాల్లో గెలుపొంది..అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అవధ్ రీజియన్ లో 38 స్థానాలకు 14 నియోజకవర్గాల్లో ఎస్పీ గెలుపొందింది. ఈ సారి కూడా బీఎస్పీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రెండు పార్టీలకు కలిపి 186 స్థానాలు వచ్చాయి. ఈ ఆరు జిల్లాల పరిధిలో ఈ రెండు పార్టీలకు 21 స్థానాలు వచ్చాయి.

సొంత మెజారిటీతో మాయావతి ఇలా..
2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రీజియన్‌లో 15 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ తొలిసారి క్షేత్రస్థాయిలో బలాన్ని కోల్పోయి 12 స్థానాలకు పరిమితమైంది. దళితులు, ముస్లింలు, బ్రాహ్మణుల మధ్య ఐక్యతను ప్రతిపాదిస్తూ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఘటన విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి యూపీలో మాయావతి సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు.

అతి పిన్న వయస్సులోనే సీఎంగా అఖిలేశ్
2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అవధ్ రీజియన్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. 38 స్థానాలకు 29 స్థానాల్లో విజయం సాధించి రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 403 స్థానాలకు 224 స్థానాలు ఎస్పీ ఖాతాలో చేరాయి. ఈ రీజియన్‌లో బీఎస్పీ కేవలం ఐదు స్థానాలకు పరిమితమైంది.












Click it and Unblock the Notifications