సర్కార్ దవాఖానా ఇంత ఘోరమా!.. మనుషులేనా అసలు?
రాంచీ : "నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకు.." ప్రభుత్వాసుపత్రుల దుస్థితిని అద్దం పట్టే పాట ఇది. ఏళ్లుగా దేశంలోను ప్రభుత్వాసుపత్రుల దుస్థితి ఇంతకు కించిత్తు కూడా మారలేదనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రభుత్వాసుపత్రి సిబ్బంధి నిర్లక్ష్య వైఖరికి ఇదో మచ్చు తునక మాత్రమే.
జార్ఖండ్ లో అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న రాంచీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఓ మహిళా రోగికి నేల మీద అన్నం వడ్డించారు సిబ్బంది. నేల మీద వడ్డించిన అన్నాన్నే ఆ అభాగ్యురాలు తింటున్న ఫోటోలు మరునాడు దైనిక్ భాస్కర్ లో ప్రచురితం కావడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది.

చేతికి గాయం కారణంగా వేసిన కట్టుతో పాల్మతి దేవి అనే మహిళా రోగి ఇలా నేల మీద వడ్డించిన అన్నంతోనే కడుపు నింపుకుంది. కేవలం ప్లేట్లు లేవన్న కారణంతో.. ఆసుపత్రి వార్డు బాయ్స్ ఆమెకు నేల మీదే భోజనం వడ్డించారు. తన దగ్గర పళ్లెం లేకపోవడంతో ప్లేట్ ఇవ్వాల్సిందిగా సిబ్బందిని కోరింది పాల్మతి దేవి. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన సదరు సిబ్బంది.. అత్యంత నిర్దయగా ఆమెకు నేల మీదనే భోజనం వడ్డించేశారు.
ఆకలి బాధతో.. ఇక చేసేదేమి లేక.. అలా నేల మీద వడ్డించిన అన్నంతోనే కడుపు నింపుకుంది పాల్మతి దేవి. కాగా, రూ.300కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన ఆసుపత్రిలో రోగులకు సరిపడా ప్లేట్లు కూడా అందుబాటులోకి లేకపోవడంపై ప్రజాస్వామిక వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications