భేటీ: అహ్మదాబాద్‌కు పవన్? మోడీకి తోడైతే బిజెపిదే..
న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారమే గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసే అవకాశాలున్నాయని వినికిడి. మోడీతో సోమవారమే భేటీ కావాలని పవన్ భావించారట. అయితే మోడీ సభలు తదితర కారణాలతో అది కురదలేదు.
దీంతో ఒకటి రెండు రోజుల్లో మోడీని కలిసే అవకాశముందని వార్తలు వచ్చాయి. అయితే మోడీని కలిసేందుకు పవన్ కళ్యాణ్ మంగళవారమే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆయన ఈ రోజు రాత్రి వరకు లేదా రేపు మోడీని కలిసే అవకాశముందని అంటున్నారు. అప్పుడే పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

బిజెపిపై పవన్ సానుకూల దృక్పథం
ఐదు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సమయంలో కాంగ్రెస్ కో హఠావో అంటూ నినదించారు. అంతేకాదు కాంగ్రెసు పార్టీని ఓడించేందుకు తాను ఎవరితోనైనా కలుస్తానని, మాట్లాడుతానని ప్రకటించారు. ఇప్పుడు ఆయన మోడీతో భేటీ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ దాదాపు ఖాళీ అయింది. మరోవైపు రాజ్యసభలో బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు సీమాంధ్ర కోసం పోరాడారు అనే ప్రశంసలు అందుకుంటున్నారు. మోడీ హవాకు తోడు బిజెపి సీమాంధ్రకు కొంత మేలు చేసే ప్రయత్నం చేసిందన్న సానుకూలదృక్పథం ప్రజల్లోను ఉంది. ఇప్పుడు దానికి పవన్ ఇమేజ్ తోడు అయితే.... సీమాంధ్రలో బిజెపికి తిరుగు ఉండదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications