వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడి; రివెంజ్ తీర్చుకున్న ముగ్గురు.. ఎందుకంటే!!
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఏ ఘడియలో వచ్చాయో కానీ ఈ రైళ్లకు ఆది నుంచి కష్టాలు తప్పడం లేదు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడుల ఘటనలు నిత్యకృత్యంగా మారాయి . తాజాగా మరో వందే భారత్ రైలు పై దాడి ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ఇటీవల జులై ఏడవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించిన గోరఖ్ పూర్ లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పైన రాళ్ళ దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోరఖ్ పూర్ నుండి లక్నో వెళుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

నేడు లక్నో బయలుదేరిన క్రమంలో మార్గమధ్యంలో సోహవాల్ ప్రాంతానికి రైలు చేరుకునే సరికి ముగ్గురు వ్యక్తులు వందే భారత్ రైలుపై రాళ్లు రువ్వారు. ఇక ఈ రాళ్ల దాడిలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో రెండు బోగీల కిటికీల అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ వందే భారత్ రైలు తన గమ్య స్థానానికి చేరుకుంది.
రైలు బోగీల కిటికీల అద్దాలు దెబ్బతినడంతో రాళ్ల దాడి జరిగినట్టుగా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి ఘటనకు బాధ్యులను గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే వీరు ఎందుకు రైలుపై రాళ్లు రువ్వారు అన్నదానిపై వారిని విచారించారు.
రైల్వే ట్రాక్ పై గడ్డి మేస్తున్న తమ మేకల మంద వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అవి మృత్యువాత పడ్డాయి అని, దీంతో ఆగ్రహంగా ఉన్న తాము వందే భారత్ రైలుపై రాళ్లు రువ్మవాని వారు రైల్వే పోలీసులకు తెలిపారు. ఈ కేసులో నన్హు పాసవాన్ తో పాటు అతని ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై రైల్వే ఆస్తులు నష్టం చేసినందుకు రైల్వే చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications