• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Period Date Chart: పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పీరియడ్ చార్టు

ఉత్తర్ ప్రదేశ్‌ మేరఠ్‌లోని హాషిమాపురాకు చెందిన అల్‌ఫిషా ఇంట్లో తలుపుపై తనకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో ఒక చార్టును పెట్టారు. తన తండ్రి, సోదరుడు కూడా ఇదే ఇంటిలో ఆమెతోపాటే కలిసి జీవిస్తారు. వారు కూడా అప్పుడప్పుడు ఈ చార్టువైపు చూస్తుంటారు. అయితే, ఇదేమీ వారికి కొత్తగా అనిపించడం లేదు.

''పీరియడ్స్ సమయంలో మహిళలకు చాలా సమస్యలు వస్తుంటాయి. చికాకు, బలహీనత లాంటి చాలా సమస్యలు వారిని చుట్టుముడుతుంటాయి. ఈ చార్టును ఇంటిలో పెట్టడంతో అందరికీ నాకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది. నా పీరియడ్స్‌ను నేను కూడా జాగ్రత్తగా గమనించొచ్చు. అవి సరైన సమయానికే వస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు’’అని ఆమె చెప్పారు.

మేరఠ్‌కు చెందిన ఆలిమా ఇంటిలోనూ ఇలాంటి చార్టు కనిపిస్తోంది. ఆలిమా ఇంటిలో సోదరుడు, సోదరి, తండ్రితోపాటు మొత్తంగా ఏడుగురు ఉంటారు. వీరంతా తన రుతుచక్రం గురించి తెలుసుకోవడం ముఖ్యమని ఆలిమా భావిస్తున్నారు.

''నేనొక టీచర్‌ను. ఇంటికి దూరంగా వెళ్లి పనిచేస్తాను. అయితే, రుతుచక్ర సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. ఇలాంటి చార్టులు ఇంటిలో ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ అవగాహన వస్తుంది. అప్పుడు మనం కూడా కాస్త సౌకర్యంగా ఉండేందుకు వీలు పడుతుంది’’అని ఆలిమా చెప్పారు.

పీరియడ్ చార్టు

ఈ మార్పు ఎలా వచ్చింది?

మేరఠ్‌లోని భిన్న ప్రాంతాల్లోని 65 నుంచి 70 ఇళ్లలో ఇలాంటి పీరియడ్ చార్టులు కనిపిస్తున్నాయి. అయితే, ఒక్కసారిగా పెళ్లయిన వారు, పెళ్లి కాని వారు ఇంటిలోని, బహిరంగ ప్రదేశాల్లో ఈ చార్టులు ఎందుకు ఏర్పాటుచేస్తున్నారు. ఈ ప్రశ్నకు స్వచ్ఛంద సంస్థ ''సెల్ఫీ విత్ డాటర్’’ ఫౌండేషన్‌కు చెందిన డైరెక్టర్ సునీల్ జాగలాన్ సమాధానం ఇచ్చారు.

''మా ఎన్జీవోను 2017లో ఏర్పాటుచేశాం. మహిళల కోసం మేం చాలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హరియాణాలతోపాటు ఉత్తర భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో 2020 నుంచి పీరియడ్ చార్టులపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం’’అని ఆయన చెప్పారు.

''మహిళలకు విద్య, ఆరోగ్యం, హక్కులు, ఆర్థిక స్వాలంబన కోసం మా సంస్థ కృషి చేస్తోంది’’అని ఆయన వివరించారు. ''రుతుస్రావ సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మేం ఎక్కువగా ఆలోచించేవాళ్లం. మా ఇంట్లోని మహిళలు ఇబ్బంది పడుతుంటే గమనించేవాళ్లం. ఈ విషయంలో ఏదైనా ఎందుకు చేయకూడదని మేం ఆలోచించాం. కొందరు వైద్యులు, నిపుణులతో మాట్లాడిన తర్వాత, ఈ పీరియడ్ చార్ట్ ఆలోచన వచ్చింది’’అని ఆయన తెలిపారు.

250 చార్టుల్లో 180 చింపేశారు

మేరఠ్‌లో పీరియడ్ చార్టులపై ప్రచారం డిసెంబరు 2021లో మొదలైంది. దీనిలో భాగంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటుచేశారు. పాఠశాలలు, కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవారు. ముఖ్యంగా మహిళా విద్యార్థినులపై దీని గురించి మాట్లాడేవారు.

''మేం డిసెంబరు 2021లో మేరఠ్‌లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మొత్తంగా భిన్న రాష్ట్రాల్లో దీనిపై 30 నుంచి 35 మంది మహిళా సభ్యులు పనిచేస్తున్నారు. మేం స్కూళ్లు, కాలేజీల్లోని మహిళా విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రయత్నించాం. లాడో పంచాయతీలు కూడా నిర్వహించాం. అక్కడ గ్రామంలోని మహిళలందరినీ పిలిచి దీని గురించి వివరించేవాళ్లం. కొంతమంది ప్రతినిధులు ఇంటిఇంటికీ వెళ్లి ప్రచారం చేపట్టేవారు. మహిళల మొబైల్ నంబర్లు తీసుకొని, వాట్సాప్ గ్రూప్‌లు కూడా ఏర్పాటుచేశారు. కొన్ని ప్రాంతాల్లో మాకు సాయం చేసేందుకు కొందరు మగవారు కూడా ముందుకు వచ్చారు’’అని సునీల్ చెప్పారు.

''మేం మొత్తంగా 250 చార్టులను అమ్మాయిలకు పంపిణీ చేశాం. కానీ, మా ప్రతినిధులు ఇళ్లకు వెళ్లి చూసినప్పుడు.. మాకు 65 నుంచి 70 చార్టులు మాత్రమే కనిపించాయి. మిగతావి కుటుంబ సభ్యులు చింపేయడమో లేదా అసలు ఇంటిలో వాటిని పెట్టొద్దనో సూచించేవారు. అయితే, కొన్ని ఇళ్లలోనైనా వీటిని ఏర్పాటుచేయడం విషయంలో మేం సంతృప్తిగానే ఉన్నాం. ఈ మహిళలు అవగాహనను పెంచడంలో మరింత సాయం చేయగలరని భావిస్తున్నాం’’అని సునీల్ వివరించారు.

అయితే, కొన్ని వర్గాల నుంచి ఈ ప్రచారానికి వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోందని ఆయన తెలిపారు.

ఈ చార్టులతో అమ్మాయి ఆరోగ్యం మెరుగుపడుతుందా?

ఈ చార్టులను ఏర్పాటుచేయడం వెనుక ముఖ్య ఉద్దేశం మహిళల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడమేనని సునీల్ వివరించారు.

''పీరియడ్స్ సమయంలో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. చికాకు, బలహీనత, అలసిపోవడం, ఒళ్ల నొప్పులు లాంటి చాలా సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఇంటిలోని మిగతావారు వారికి అండగా నిలవాలి. ఆ సమయంలో వారు తీసుకునే ఆహారంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’’అని ఆయన అన్నారు.

''ఈ చార్టుపై ఒక ఏడాది డేట్లు ఉంటాయి. దీంతో రుతుచక్రం ఏదైనా సమయం తప్పితే, వెంటనే తెలుసుకోవచ్చు. అప్పుడు ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సాయం కోరవచ్చు. దీంతో మహిళల ఆరోగ్యం కచ్చితంగా మెరుగుపడుతుంది’’అని సునీల్ చెప్పారు.

పీరియడ్ చార్టు

నిరసనలు, చెత్త వ్యాఖ్యలు

ఉత్తర భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో మహిళలకు పీరియడ్ చార్టులపై అవగాహన ఉంది. దీనిపై మరింత అవగాహన కోసం ఆన్‌లైన్‌లోనూ లాడో పంచాయతీలను ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణాలలో నేరుగానూ ప్రచారాలు చేపడుతున్నారు.

''కొన్ని ప్రాంతాల్లో కొందరు నిరసన తెలుపుతుంటారు. మరికొందరు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ, మేం అలాంటి వాటిని పట్టించుకోం. ఈ విషయంలో మత నాయకుల సాయం కూడా తీసుకుంటున్నాం. చాలా మంది మాకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు’’అని సునీల్ చెప్పారు.

''మొదట్లో ధైర్యం ఉండేది కాదు..’’

బహిరంగ ప్రదేశాలు, ఇళ్లలో పీరియడ్ చార్టులు ఏర్పాటుచేసినప్పుడు చాలా మంది మహిళలు, అమ్మాయిలు మొదట్లో చాలా అసౌకర్యంగా ఫీలయ్యేవారు.

''నాకు పెళ్లయింది. మా ఇంటికి మామయ్య, బావగారు, ఇతర కుటుంబ సభ్యులు తరచూ స్తుంటారు. మొదట్లో ఈ చార్టు గురించి తెలుసుకున్నప్పుడు, దీన్ని ఇంట్లో పెట్టడం ఎలా అని ఆలోచించాను. దీనిపై నా భర్తతో మాట్లాడాను. అప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. మా అత్తయ్యకు కూడా చెప్పాను. ఆమె కూడా సరేనన్నారు’’అని ఆలిమా చెప్పారు.

ఈ పీరియడ్స్ చార్టులు ఏర్పాటుచేసిన తర్వాత ఇంట్లో వారిలో ఏదైనా మార్పులను గమనించారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ''అవును. నా రుతుచక్రం గురించి ఏమీ తెలియనప్పుడు వారు అసలు పట్టించుకునేవారు కాదు. కానీ, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు’’అని ఆమె వివరించారు.

మరోవైపు మనీషా దీనిపై మాట్లాడుతూ.. ''ఇది మా ఆరోగ్యానికి సంబంధించిన విషయం. రుతుస్రావ సమయంలో మేం ఎదుర్కొనే సమస్యలు అందరికీ తెలియాలి. అప్పుడే పరిస్థితి వారికి కూడా అర్థం అవుతుంది. లేకపోతే, అందరూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారు’’అని అన్నారు.

''ఇంట్లో చార్టు పెట్టాలని నా భార్యకు సూచించాను’’

హాషిమాపురాలోనే జుబైర్ అహ్మద్ కూడా జీవిస్తుంటారు. ఈ విషయంలో మహిళలకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు సెలూన్ షాప్ ఉంది.

''రుతుస్రావ సమయంలో మహిళలపై మరింత ఒత్తిడి చేయకూడదు. మిగతావారు ఏం అనుకుంటారో అనే ఆలోచన అసలు మహిళలకు రాకూడదు’’అని ఆయన అన్నారు.

''నీకు సౌకర్యంగా ఉంటే ఇంట్లో నువ్వు కూడా పీరియడ్ చార్టు పెట్టుకోవచ్చని నా భార్యకు చెప్పాను. నా స్నేహితులకు కూడా నేను అదే చెబుతాను’’అని ఆయన వివరించారు.

పీరియడ్ చార్ట్‌పై షార్ట్‌ఫిల్మ్..

పీరియడ్ చార్ట్‌పై ఒక షార్ట్‌ఫిల్మ్ కూడా తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను సునీల్ తీసుకున్నారు. ఈ సినిమాలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రిషిదా ప్రధాన పాత్ర పోషించారు.

''ఏప్రిల్ 2021లో పీరియడ్ చార్ట్ షార్ట్‌ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. స్క్రిప్ట్ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే దీనిపై సునీల్‌తో మాట్లాడాను. ఈ ప్రచారానికి నన్ను అంబాసిడర్‌గా ఆయన నియమించారు. ఈ విషయంపై చాలా రాష్ట్రాలకు చెందిన మహిళలతో నేను మాట్లాడుతున్నాను’’అని రిషిదా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Period Date Chart: Why are these girls putting period day charts on their doors?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X