భారత్ నుంచి త్వరలో రైల్లో హజ్ యాత్ర ! సౌదీతో చర్చలు- ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
ప్రతీ ఏటా భారత్ నుంచి లక్షల సంఖ్యలో ముస్లింలు సౌదీ అరేబియాలోని పవిత్ర పుణ్యక్షేత్రం హజ్ యాత్రకు వెళ్తుంటారు.మన దేశం నుంచి ముస్లింలు విమాన మార్గంలో ఈ యాత్రకు వెళ్తుంటారు. వాస్తవానికి ఇది ఎంతో వ్యయంతో కూడుకున్నది. అలాగే రవాణా పరంగానూ సవాలుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి రైల్లో సౌదీ యాత్రకు ప్రయాణికులు వెళ్లేలా ఓ మార్గం నిర్మిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం ఇరుదేశాలు చర్చిస్తున్నాయి.
భారత్-సౌదీ అరేబియా దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడం, భారత్ నుంచి వెళ్లే హజ్ యాత్రికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో ఈ కొత్త రైల్వే ట్రాక్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వివిధ దేశాల్లో హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు శరవేగంగా రూపుదిద్దుకుంటుండటం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉండటంతో ఈ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి.

భారత్ నుంచి హజ్ యాత్రికుల కోసం ఓ ప్రత్యేక రైలు సౌదీ అరేబియాకు వెళ్లడం ద్వారా అందరికీ ప్రయోజనం ఉండబోతోంది. ఇది హజ్ యాత్రికులకు ప్రయాణ ఖర్చుల్ని భారీగా తగ్గిస్తుంది. దీంతో ఎక్కువ మంది హజ్ యాత్రకు వెళ్లేందుకు కూడా అవకాశం దొరుకుతుంది. విమానాలతో పోలిస్తే రైళ్లలో హజ్ యాత్రికులు ప్రయాణంలో మరింత మెరుగైన ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుంది. వారికి తగినంత విశ్రాంతి కూడా దొరుకుతుంది. అలాగే ఎక్కువ మందితో వారు తమ ఆధ్యాత్మిక సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
మరోవైపు భారతదేశం నుండి సౌదీ అరేబియాకు నేరుగా రైలు ప్రయాణం మొదలైతే ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గిపోవడం ఖాయం. అయితే హై-స్పీడ్ రైళ్ల వల్ల విమాన ప్రయాణంతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీంతో యాత్రికులు మక్కాలో తమ మతపరమైన బాధ్యతలకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. అయితే ఇందులో కొన్ని సవాళ్లూ లేకపోలేదు. భారత్-సౌదీని కలిపే రైల్వే ప్రాజెక్టుకు భారీ పెట్టుబడి, ప్రణాళికలు అవసరం. భూసేకరణ, డిజైన్, ఇరుదేశాల మధ్య ఉండే సంబంధాలు కీలకంగా మారతాయి.

అలాగే భౌగోళికంగానూ ఈ రైలు మార్గం ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన భూభాగాల గుండా వెళుతుంది. వేడిగా మండే ఎడారులు, పీఠభూములు, పర్వత శ్రేణుల మీదుగా రైలు ప్రయాణించాలి. బలూచిస్తాన్, ఇరాన్‌లోని జాగ్రోస్ పర్వత శ్రేణుల కఠినమైన భూభాగాలను దాటడం పెద్ద సవాలే. అరేబియా ఎడారిలో విపరీతమైన వేడితోనూ మరో ప్రమాదం పొంచి ఉన్నట్లే. అలాగే అంతర్జాతీయ సరిహద్దుల గుండా ప్రయాణించాలంటే పలు నిబంధనలు అవసరమవుతాయి. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ తప్పిస్తేనే ఈ ప్రయాణం సాధ్యమవుతుంది. అలాగే ప్రయాణమంతా ప్రయాణీకుల భద్రత చాలా ముఖ్యమైనది. యాత్రికులను రక్షించడానికి రైళ్లలో, స్టేషన్లలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయక తప్పదు.
హజ్ తీర్థయాత్ర కోసం భారతదేశం నుండి సౌదీ అరేబియాకు నేరుగా రైలు సేవల అవకాశం భారతీయ ముస్లింలకు మంచి ప్రయాణ అనుభూతిని మిగల్చడం ఖాయం. పలు సవాళ్లు ఉన్నప్పటికీ, రైల్వే సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ సహకారంలో పురోగతి లభిస్తే మాత్రం ఆచరణ ఖాయం. ఇటువంటి రైల్వే ప్రాజెక్ట్ ప్రయాణికులకు ఖర్చు, సౌలభ్యం, సౌకర్యాన్ని పెంపొందించే అవకాశముంది.












Click it and Unblock the Notifications