ముందుకే: రేపు టీపై ఉభయసభల్లో ప్రధాని ప్రకటన
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని చెప్పినప్పటికీ తెలంగాణ విషయంలో ముందుకే వెళ్లాలని యుపిఎ ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. రాజ్యసభలో ఈ నెల 10వ తేదీన బిల్లును ప్రతిపాదిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇప్పటికే రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు.
తాజాగా, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రేపు గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణపై ప్రకటన చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రతిపక్షాలకు ఆయన వివరించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై తాము చేసిన కసరత్తు, జరిపిన సంప్రదింపులు తదితర వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యత గురించి కూడా ఆయన వివరించవచ్చునని అంటున్నారు.

తెలంగాణ బిల్లు ఆమోదానికి పార్లమెంటులో సహకరించేందుకు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం వార్ రూంలో జరిగిన సమావేశంలో నిరాకరించినప్పుడు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఘాటుగానే సమాధానం చెప్పారు. తమ పనేదో తాము చేసుకుంటామని ఆయన చెప్పారు.
తెలంగాణపై వెనక్కి వెళ్లే పరిస్థితిలో కాంగ్రెసు అధిష్టానం ప్రస్తుతం లేదు. వెనక్కి పోతే సంభవించే పరిణామాలేమిటో అధిష్టానం పెద్దలకు తెలుసు. అందుకే, ముందుకు సాగాలనే దృఢ నిశ్చయంతో ఉంది. బిజెపి సహకారం లభిస్తుందనే నమ్మకంతో కాంగ్రెసు అధిష్టానం, యుపిఎ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications