ఎర్రకోట వేదికగా కొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ..!!
న్యూఢిల్లీ: యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోదీ చెప్పారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయంటూ ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దాని ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పదో స్థానానికి దిగజారిందంటూ ధ్వజమెత్తారు. తమ హయాంలో నవ భారత నిర్మాణం జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు.
ఇది మోదీ ప్రభుత్వం అని, ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. దాన్ని అనుకున్న సమయం కంటే ముందే ఛేదించడమూ తమకు తెలుసునని అన్నారు. అలసిపోయే, ఆగిపోయే, ఓడిపోయే భారత్ కాదు.. ఇప్పుడున్నది ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రధాని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
విశ్వకర్మల కోసం ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి మెరుగైన జీవనాన్ని కల్పించడానికి, ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి దీన్ని ప్రారంభించబోతోన్నామని అన్నారు.
13,000 నుంచి 15,000 కోట్ల రూపాయలతో వచ్చే నెలలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతోన్నామని ప్రధాని మోదీ చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాధికారతను కల్పిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications