త్రిపురలో కాంగ్రెస్, లెఫ్ట్ పై మోడీ విసుర్లు-భయం, హింస నుంచి కాపాడింది బీజేపీయే..
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఈ నెల 16న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 60 స్ధానాలున్న త్రిపుర అసెంబ్లీకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతోంది. గతంలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న త్రిపురలో పాగా వేసిన బీజేపీ ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుని మరోసారి ఓటు అడుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, స్ధానిక పార్టీల కూటమి తిప్రా మోథా నుంచి బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. దీంతో ఈ చిన్న రాష్ట్రంలో ప్రధాని మోడీ ప్రచారానికి వెళ్లారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబాసాలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిపురలో ప్రజల్ని భయం, హింస నుంచి రక్షించింది బీజేపీ మాత్రమేనని మోడీ తెలిపారు. మరోసారి బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు అభివృద్ధి లేకుండా చేశాయని మోడీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాకే ఇక్కడ అభివృద్ధి సాధ్యమైందన్నారు.

గతంలో కమ్యూనిస్టుల పాలనతో పోలీసు స్టేషన్లను సీపీఎం కార్యకర్తలు ఆక్రమించేవారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన సాగుతోందని ప్రధాని మోడీ తెలిపారు. త్రిపురలో అన్ని గ్రామాల్ని కలుపుతూ బీజేపీ సర్కార్ 5 వేల కిలోమీటర్ల రోడ్లు వేసిందని గుర్తుచేశారు. అగర్తలలో కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు ఆప్టికల్ ఫైబర్, 4జీ నెట్ వర్క్ కూడా తెచ్చినట్లు మోడీ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 55 సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీ, మరో ఐదు సీట్లను తమ మిత్రపక్షం ఐపీఎఫ్టీకి కేటాయించింది.












Click it and Unblock the Notifications