చరిత్ర సృష్టించిన పంబన్ వంతెన.. 100 ఏళ్లు గ్యారంటీ.. ఈ విశేషాలు తెలుసా..?
దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రెడీ అయింది. తమిళనాడులోని పంబన్ కొత్త బ్రిడ్జిని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జిని RVNL అనే సంస్థ నిర్మించింది.
పంబన్ బ్రిడ్జిని 1914లో ప్రారంభించారు. 2022లో డిసెంబర్ లో మూసివేశారు. పాత బ్రిడ్జి మూసివేతతో రామేశ్వరం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత బ్రిడ్జిపై 30 నిమిషాలు ప్రయాణం పడుతుండగా.. కొత్త బ్రిడ్జిపై కేవలం 5 నిమిషాల్లోనే రైలు దూసుకెళ్లనుంది.

దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని కలిపేలా నిర్మించారు. నిలువుగా పైకి లేచేలా వర్టికల్ టెక్నాలజీతో ఈ వారథిని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు ప్రారంభించింది. నాలుగేళ్లలో పూర్తిచేసింది. నిర్మాణంలో కొంచెంకూడా తేడా రాకుండా నిపుణులు జాగ్రత్తలు తీసుకున్నారు. వందల మంది ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వర్టికల్ లిఫ్ట్ శ్వాన్ ను తీరం నుంచి 660 మీటర్ల దూరం తీసుకెళ్లేందుకు దాదాపు 6 నెలల సమయం పట్టింది. 660 టన్నులు, 72.5 మీటర్ల పొడవు ఉంది ఈ వర్టికల్ లిఫ్ట్ ఉంది.

సముద్రంలో రెండు కిలోమీటర్లు పైగా పొడవున్న ఈ వంతెన కింద ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. దీనికి రెండు వైపులా నిలువు స్తంభాలు ఉంటాయి. వాటికి 310 నుంచి 320 టన్నుల బరువున్న ధూలాలు వేలాడుతూ ఉంటాయి. రెండు ధూలాల బరువు 625 టన్నులు. మొత్తం లిఫ్ట్ లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి.

బ్రిడ్జి ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద మోటార్లు, లిఫ్టుల సాయంతో సులభంగా పైకి వస్తుంది. ఇదంతా రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేస్తుంది. రెండు కిలోమీటర్ల వంతెనలో 18.3 మీటర్ల పొడవుతో 99 దిమ్మెలు ఉన్నాయి. ఒక్కో దిమ్మెకు అనుబంధంగా మూడు గుండ్రటి పిల్లర్స్ నిర్మించారు. ఇవి పటిష్టంగా ఉండేందుకు సముద్రంలో నేల తగిలేవరకూ 25 నుంచి 35 మీటర్ల లోతులో పునాదులు తీశారు. బ్రిడ్జి సముద్రంలో ఉంటుంది కాబట్టి తుప్పు పడుతుంది. పాత బ్రిడ్జి అలాగే తుప్పు పట్టింది. అయితే తాజాగా కొత్త బ్రిడ్జి తుప్పు పట్టకుండా మూడు పొరలతో సిల్వర్ పెయింటింగ్ వేశారు. దీంతో 58 ఏళ్ల వరకూ ఎలాంటి ధోఖా ఉండదు. చిన్నచిన్న మరమ్మతులు వచ్చినా వందేళ్ల వరకూ చెక్కుచెదరదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సముద్రంలో దిమ్మెలు పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంలో వైరింగ్ చక్రాలతో కాంక్రీట్ వేశారు. ట్రాక్ పక్కన నడిచే దారుల్లో ఉప్పు చేరకుండా స్టెయిన్ లెస్ స్టీల్ తో పాటు ఫైబర్ రీ ఇన్ఫోర్సెడ్ స్టీల్ వాడారు. వర్టికల్ లిఫ్ట్ వంతెనకు ఒక్క పోటు కూడా వాడకుండా మొత్తం వెల్డింగ్ తోనే నిర్మించారు. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు. గంటకు 58 కి.మీ. వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సర్లు దానంతట అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలపై టవర్లు, యంత్రాలు కూడా ఉన్నాయి. దిమ్మెల్లోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు, చక్రాలు ఉన్నాయి.
A bridge that connects with the Tamil culture & heritage…
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 5, 2025
PM @narendramodi Ji will inaugurate the landmark new Pamban Bridge today.
📍Rameswaram, Tamil Nadu pic.twitter.com/1hgYbkXuDf
మత్స్యకారుల పడవలు, లాంఛ్ పడవలు, నేవీ, పోర్టులనుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు దిమ్మెలపై ఉన్న గదుల్లోకి చేరి వంతెనను లిఫ్ట్ చేస్తారు. వర్టికల్ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకోగా.. మిగిలినవన్నీ భారత్ లోని సాంకేతికతతోనే నిర్మించారు.
పంబన్ బ్రిడ్జి .. భారతదేశంలోనే సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెనగా పేరు గాంచింది. పంబన్ బ్రిడ్జిని శ్రీలంకకు భారత్ కు మధ్య గల పాక్ జలసంధి పై నిర్మించారు. ఈ వంతెన పంబన్ ద్వీపం, రామేశ్వరం పట్టణాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జి రోడ్డు, రైలు వంతెన కలిగిఉంది. పంబన్ బ్రిడ్జిని 1914లో ప్రారంభించారు. ఈ వంతెన 20ా10 వరకు భారతదేశంలో ఉన్న అన్ని వంతెనలలో పెద్దదిగా నిలిచింది. 2.3 కిలోమీటర్లు ఉన్న ఈ వంతెన నిర్మించి 2014 ఫిబ్రవరి 24 నాటికి వందేళ్లు పూర్తయింది.
పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని శ్రీరాముని పుట్టినరోజైన శ్రీరామనవమి నాడే జరుపుకోవడానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రామేశ్వరం రామాయణంలో ప్రముఖ స్థలంగా పేర్కొనబడింది. ఈ నేపథ్యంలో దేశ సాంస్కృతిక వైభవాన్ని, ఆధునిక అభివృద్ధిని కలబోసే ఈ వంతెన జాతికి అంకితం చేయడం గర్వకారణంగా మారింది. పంబన్ వంతెన దేశ ఇంజినీరింగ్ ప్రతిభను చూపిస్తూ, రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలవనుంది.
ఇక పంబన్ బ్రిడ్జి ప్రారంభం అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది. ఈ బ్రిడ్జి ప్రారంభం తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సమావేశంలో పాల్గొని రూ.8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. తర్వాత ప్రధాని మోదీ రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications