ఇంగ్లీష్ మాధ్యమం మాత్రమే-మేధస్సుకు కొలమానం కాదు- ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
భారత్ లో ఇంగ్లీష్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ భాషల అస్తిత్వం దెబ్బతింటోందనే విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఏపీ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వం తెలుగు భాషను తొలగించి ఇంగ్లీష్ మీడియం చదువులు అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో స్థానిక భాషల వినియోగాన్ని సమర్ధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇంగ్లీషు అనేది కేవలం సమాచార మాధ్యమం మాత్రమేనన్నారు. మేధోసంపత్తికి కొలమానం మాత్రం కాదన్నారు. గాంధీనగర్‌లోని అదాలజ్ పట్టణంలో గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. సమాచార మాధ్యమంగా ఉన్నప్పటికీ మేధావిగా ఉండేందుకు ఆంగ్లాన్ని కొలమానంగా జనం భావించేవారని మోడీ తెలిపారు.
గతంలో ఆంగ్ల భాషా పరిజ్ఞానం మేధోసంపత్తికి చిహ్నంగా పరిగణించేవారని, వాస్తవానికి ఆంగ్ల భాష కేవలం కమ్యూనికేషన్ మాధ్యమమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో ఇంగ్లీష్ భాష అవరోధంగా ఉందని, గ్రామాల నుంచి చాలా మంది ప్రతిభావంతులు కూడా ఇంగ్లీష్ రాని కారణంగా వైద్యులు, ఇంజనీర్లుకాలేకపోతున్నారని ప్రధాని మోడీ తెలిపారు. నూత విద్యా విధానం ఆంగ్ల భాషను చుట్టుముట్టిన "బానిస మనస్తత్వం" నుండి దేశాన్ని బయటకు తెస్తుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. పేద తల్లిదండ్రుల పిల్లలు ఇంగ్లీషులో చదువుకోకపోయినా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇంగ్లీషు భాష లేకపోవడం వల్ల ఎవరూ వెనుకబడకుండా చూడాలని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం ఆంగ్ల భాష చుట్టూ ఉన్న ఈ బానిస మనస్తత్వం నుండి దేశాన్ని బయటకు తెస్తుందన్నారు. అలాగే దేశంలో కొత్తగా ప్రారంభించిన 5జీ టెలికాం సేవలు విద్యా వ్యవస్థను తర్వాతి స్థాయికి తీసుకెళ్తాయని ప్రధాన మంత్రి మోడీ తెలిపారు. 5జీ సేవ స్మార్ట్ సౌకర్యాలు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, స్మార్ట్ బోధనలకు మించి ఉంటుందన్నారు. ఇది మన విద్యా వ్యవస్థను నెక్ట్ లెవల్ కు తీసుకువెళుతుందన్నారు.












Click it and Unblock the Notifications