PM Modi Degree: ప్రధాని మోడీ డిగ్రీపై తేల్చేసిన గుజరాత్ హైకోర్టు..!
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏం చదివారో తెలుసుకునేందుకు గత దశాబ్దకాలంగా దేశంలో చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పలువురు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు కూడా చేస్తున్నారు. గతంలో ఓసారి కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ప్రధాని మోడీ డిగ్రీ వివరాలు ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. కానీ ఆ ఆదేశాలు కూడా పని చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Modi) విద్యార్హతల వ్యవహారంపై గుజరాత్ హైకోర్టు ఇవాళ షాకింగ్ తీర్పు ఇచ్చింది.
భారత ప్రధాన మంత్రి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధి అయినందున, రాజ్యాంగబద్ధమైన పదవికి ఆయన ఎన్నిక కావడంలో ఆయన విద్యా అర్హతలకు ఎటువంటి సంబంధం లేనందున, ఆయన విద్యా పట్టాలను బహిర్గతం చేయడంలో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ అనేది సమాచార హక్కు (RTI) చట్టం కింద వెల్లడించలేని వ్యక్తిగత సమాచారమని గుజరాత్ హైకోర్టు తెలిపింది.

గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ డి.ఎన్.రే ధర్మాసనం.. వెలువరించిన తీర్పులో.. పిటిషనర్ కోరిన విద్యా డిగ్రీకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం దేశ ప్రధానమంత్రికి చెందినది అయినంత మాత్రాన, ఆ సమాచారం చట్టంలోని సెక్షన్ 8(1)(ఇ), (జె) కింద ఉన్న మినహాయింపులకు మినహాయింపు అయిన ప్రజా ప్రయోజనం లేదా విస్తృత ప్రజా ప్రయోజనం పరిధిలోకి దానంతట అదే వస్తుందని అర్థం కాదని స్పష్టం చేసింది. ఈ సెక్షన్లు విశ్వసనీయ సంబంధాలు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడానికి నిరాకరించేందుకు ప్రభుత్వ అధికారులకు చట్టపరమైన మినహాయింపులను అందిస్తాయి. ప్రధానమంత్రి విద్యార్హతకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉందని కేంద్ర సమాచార కమిషన్ పేర్కొన్నప్పటికీ, ఆర్టీఐ చట్టం కింద బాధ్యతలను పరిగణనలోకి తీసుకునే విషయంలో ఆ వాస్తవానికి ఎటువంటి సంబంధం లేదని హైకోర్టు తెలిపింది.














Click it and Unblock the Notifications
