రూల్స్ పేరుతో ప్రజలను వేధిస్తారా- ఘాటుగా రియాక్ట్ అయిన ప్రధాని మోదీ
ఇండిగో సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. విమానాల రద్దుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోజూ లక్షలమంది ఇబ్బంది పడుతున్నారని, ఇది సరికాదని అసహనాన్ని వ్యక్తం చేశారు. వ్యవస్థాగత సమస్యల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని, రూల్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్పు, వారికి ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకూడదని హితబోధ చేశారు.
నియమాలు, చట్టాలు మంచివే అయినప్పటికీ, వ్యవస్థను సరిదిద్దే క్రమంలో ప్రజలను వేధించకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం ఎనిమిదో రోజుకు చేరుకున్న సమయంలో ప్రధాని రియాక్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బీజేపీ, ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులతో సమావేశం అయ్యారు ప్రధాని మోదీ. పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పార్లమెంట్ సభ్యులందరూ దీనికి హాజరయ్యారు. శీతాకలా సమావేశాల్లో చర్చించాల్సిన బిల్లులు, వ్యవహరించాల్సిన విధానంపై వారికి దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇండిగో సంక్షోభం గురించి మోదీ ప్రస్తావించారు. చట్టాలు, నిబంధనలు, నియమాలు మంచివే అయినప్పటికీ.. వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు, అసౌకర్యానికి గురి కాకూడదని అన్నారు. ప్రజల కోసమే వాటిని రూపొందించుకుంటోన్నామనే విషయాన్ని విస్మరించకూడదని చెప్పారు. వారి రోజువారీ జీవితాన్ని సులభతరం చేసేలా, వ్యవస్థల్లోని లోపాలు సరిదిద్దేలా, సంస్థాగతమైన సమస్యలను పరిష్కరించేలా రూల్స్ ఉండాలే తప్ప ప్రజలను వేధించేలా ఉండకూడదని అన్నారు. ఇది సరికాదని స్పష్టం చేశారు.
రోజూ వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోవడానికి కారణమైన ఇండిగో సంక్షోభంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. సత్వరమే దీన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ చెప్పిన ఈ వివరాన్నింటినీ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విలేకరులకు వెల్లడించారు. ఇండిగోపై జరిమానా విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications