అఖిలేష్ పై మోడీ విసుర్లు-మాఫియా వాదీ, ఫేక్ సమాజ్ వాదీ-రికార్డులు బ్రేక్ చేయాలని ఓటర్లకు పిలుపు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నుంచి బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటున్న వేళ.. ప్రధాని మోడీ ఇవాళ ఆ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. యూపీ ఓటర్లను ఉద్దేశించి వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన ప్రధాని, అఖిలేష్, యోగీలను కూడా పోలుస్తూ విమర్శలు చేశారు. బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను ప్రధాని కోరారు.
Recommended Video
యూపీలో మహిళలు, పిల్లల్ని కూడా విపక్షాలు వాడుకోవాలని చూస్తున్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సమాజ్ వాదీ పార్టీ క్రిమినల్స్ కు టికెట్లు ఇస్తోందన్నారు. యోగీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మాత్రం నేర నియంత్రణకు పోలీసు విభాగంలో 20 వేల మహిళల్ని, మొత్తంగా లక్షన్నర మంది సిబ్బందిని నియమించిందని గుర్తుచేశారు. యోగీ సర్కార్ యూపీలో దంగా రాజ్ ను అంతం చేసిందన్నారు. యూపీలో ప్రస్తుతం ఐదున్నర వేల స్టార్టప్స్ ఉన్నాయని, వీటిలో దాదాపుగా అన్నీ మహిళా డైరెక్టర్ల చేతుల్లోనే ఉన్నాయన్నారు.

మరోవైపు యూపీలో సమాజ్ వాదీ పార్టీని మాఫియావాదీగా అభివర్ణించిన మోడీ... సంక్షేమ పథకాలకు ఆ పార్టీ అడ్డుపడుతోందన్నారు. నకిలీ సమాజ్ వాదీలు యూపీని ఆకలితో ఉంచాలని చూస్తున్నారని, పేదలను కొల్లగొట్టి తమ ఖజానాలు మాత్రం నింపుకుంటున్నారని అన్నారు. నోయిడా, ఘజియాబాద్ ప్రజలకు ఈ విషయం బాగా తెలుసన్నారు.
యూపీలో గత సమాజ్ వాదీ ప్రభుత్వం చక్కెర కర్మాగారాల్ని మూయించేసిందని, వాటికి బకాయిలు చెల్లించలేదని మోడీ గుర్తు చేశారు. కానీ యోగీ రాక తర్వాత బీజేపీ సర్కార్ వాటిని తెరిపించడమే కాకుండా, కొత్త యూనిట్లు కూడా ప్రారంభించిందన్నారు.
సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడూ పేదలు, రైతుల సమస్యలపై దృష్టిపెట్టలేదని ప్రధాని మోడీ ఆరోపించారు. యూపీలో తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం (యోగీ సర్కార్) రైతుల ప్రయోజనాల్ని ఆరు రెట్లు పెంచిందన్నారు. ఇప్పుడు కనీస మద్దతుధర కూడా వారి ఖాతాల్లో నేరుగా జమ అవుతుందన్నారు. వ్యాక్సిన్లపై పుకార్లను పట్టించుకోకుండా వేయించుకున్న ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. యూపీలో ఐదు ఎక్స్ ప్రెస్ వేల ఏర్పాటు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తద్వారా మెరుగైన కనెక్టివిటీని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మోడీ గుర్తుచేశారు. దీనికి భిన్నంగా సమాజ్ వాదీ పార్టీ పరివార్ వాదీ పార్టీగా మారిందన్నారు. యూపీలో అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తూ తమకు మరోసారి అధికారం కట్టబెట్టాలని ఓటర్లను ప్రధాని మోడీ కోరారు.












Click it and Unblock the Notifications