బెంగాల్‌లో సిండికేట్ల రాజ్యం నడుస్తోంది: మమతపై నిప్పులు చెరిగిన ప్రధాని
దుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని దీదీపై నిప్పులు చెరిగారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ పేరుతో వస్తున్న కూటమిలోని నాయకులు బీజేపీని చూసి భయపడుతున్నారని అన్నారు. ఎందుకంటే తాను అవినీతిపై పోరాటం చేస్తున్నందునే ఆ కూటమిలోని నేతలంతా బెంబేలెత్తిపోతున్నారని మోడీ విరుచుకుపడ్డారు.
బడా బాబులకు చెందిన అవినీతి సొమ్ము, అక్రమ సంపాదనపై చాయ్‌వాలా ఉక్కుపాదంతో అనిచివేశాడు కాబట్టే... ప్రజాకాపరిగా ఉన్న తనను తొలగించాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీయేతర నేతలపై ఫైర్ అయ్యారు మోడీ. నాలుగేళ్ల క్రితం కూటమిలోని నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదని అలాంటిది నేడు కోల్‌కతాలో కలిసి తనపై నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మోడీ. బెంగాల్‌లో జరుగుతున్న అవినీతిపై కేంద్ర సంస్థలు విచారణ చేస్తుంటే అది తప్పన్నట్లు మమతా వ్యవహరిస్తున్నారన్నారు. "మమతాజీ మీరు ఎలాంటి తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారు." అని మోడీ సూటి ప్రశ్న వేశారు. యూపీఏ హయాంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనపై ఆరోపణలు రావడంతో ఢిల్లీలో 9 గంటలపాటు తనను కూర్చోబెట్టి విచారణ చేశారని మోడీ గుర్తు చేశారు.

బెంగాల్‌లో మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ వారి ఆశలను కలలను సాకారం చేస్తుందని చెప్పుకొచ్చారు మోడీ. బెంగాల్‌లో స్కూలు లేదా కాలేజీ అడ్మిషన్ కావాలంటే లంచం సమర్పించుకోవాల్సి వస్తోందని మండిపడ్డ మోడీ ఇది ఎప్పుడూ కొనసాగదని చెప్పారు. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ సబ్కా సాత్ సబ్కా వికాస్‌కు తార్కాణమన్నారు మోడీ. కమ్యూనిస్టుల పై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ.... తన ప్రభుత్వంలో కూడా ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని గుర్తెరగాలని మోడీ చెప్పారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని మమతా అణిచివేస్తోందని ధ్వజమెత్తారు.
బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పిన ప్రధాని.. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధికి కేంద్రం రూ.90వేల కోట్లు కేటాయించిందని అయితే మమతా సర్కార్ వాటిని అమలు కాకుండా అడ్డుకుందని చెప్పారు. ఆ డబ్బులను సిండికేట్‌కు పంచాలని మమత ప్రయత్నిస్తున్నారన్నారు. అభివృద్ధి దిశగా పయనించాలనే ఉద్దేశం మమత సర్కారుకు లేదని నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ.












Click it and Unblock the Notifications