సీఎంలతో ప్రధాని మోడీ భేటీ- కరోనా కల్లోలం, వ్యాక్సిన్ డ్రైవ్ చర్చ-మమత డుమ్మా ?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఇవాళ భేటీ అవుతున్నారు. వర్చువల్ విధానంలో జరిగే ఈ భేటీలో సీఎంలతో తాజా పరిస్ధితిపై ప్రధాని మోడీ చర్చించబోతున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ముమ్మరంగా చేపట్టాలని ప్రధాని కోరబోతున్నారు.
సాయంత్రం ఆరున్నర గంటలకు ముఖ్యమంత్రులతో జరిగే వర్చువల్ భేటీలో ప్రధాని మోడీ పాల్గొంటారు. మార్చి 17న ముఖ్యమంత్రులతో కరోనా వ్యాప్తిపై ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తర్వాత సీఎంలతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. దేశంలో సెకండ్ వేవ్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని ఆ సమావేశంలో ముఖ్యమంత్రుల్ని ప్రధాని మోడీ కోరారు. అయినా ఇంకా కేసులు పెరుగుతున్న తరుణంలో ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రుల సలహాలను ప్రధాని తీసుకోనున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుదలపై ఏప్రిల్ 4న ప్రధాని మోడీ ఢిల్లీలో ఉన్నతస్ధాయి భేటీ నిర్వహించారు. ఇందులో కరోనాను అడ్డుకునేందుకు పంచసూత్రాలను ఆయన ప్రతిపాదించారు. ఇందులో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ కోవిడ్‌పై సరైన నిర్ణయాలు, వ్యాక్సినేషన్ చేపట్టాలని ప్రధాని సూచించారు. ఈ భేటీలో ప్రతిపాదించిన అంశాలను ఇవాళ ప్రధాని మోడీ ముఖ్యమంత్రులకు కూడా మరోసారి వివరించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వ్యాక్సినేషన్‌ను ఏ వయో వర్గాలకు ఇవ్వాలన్న దానిపైనా సీఎంల సలహాలు తీసుకుంటారని తెలుస్తోంది.
ప్రధాని మోడీ ఇవాళ సీఎంలతో నిర్వహిస్తున్న వర్చువల్ భేటీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కాబోరని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మమత.. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను ఇప్పటికే పాటిస్తున్నట్లు గతంలోనే వెల్లడించారు. దీంతో ప్రధాని ఇవాళ నిర్వహించే భేటీతో ఒరిగేదేమీ లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మమత తనకు బదులుగా బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్‌ను ఈ భేటీకి పంపుతున్నట్లు సమాచారం. గతంలో మార్చి 17న ప్రధాని నిర్వహించిన సీఎంల భేటీకి సైతం మమత హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications